
అర్ధరాత్రి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
తాడేపల్లి రూరల్: కృష్ణానది కరకట్ట లోపల ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన అసైన్‌మెంట్ భూముల్లో రాత్రీ పగలు తేడా లేకుండా మట్టితవ్వకాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తాడేపల్లి రూరల్ పరిధిలోని చిర్రావూరు గ్రామంలో పెద్ద యంత్రాలతో తవ్వకాలు మళ్లీ ప్రారంభించారు. 2015–16 సంవత్సరాల్లో ఇలాగే అసైన్‌మెంట్ భూముల్లో తవ్వకాలు నిర్వహిస్తుంటే పది జేసీబీలు, 40 ట్రాక్టర్లను సీజ్ చేసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తాడేపల్లి రూరల్‌లోని గుండిమెడ, ప్రాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో అసైన్‌మెంట్ భూముల్లో మట్టితవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి.
జేబులు నింపుకొంటున్న మాఫియా
తిరిగి కొంతమంది రైతులను మట్టి మాఫియా వారు మభ్యపెట్టి నామమాత్రంగా నగదు ఇచ్చి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.2500 నుంచి రూ.4 వేల వరకు మాఫియా అమ్ముతోందని స్థానికులు తెలియజేశారు. అసైన్‌మెంట్ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇస్తే కొంతమంది వాటిలో మట్టితవ్వకాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల పక్కనే పంట భూములకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ అసైన్‌మెంట్ భూముల్లోకి నీరు చేరుతుందని, తవ్వకాలు వల్ల పక్కనే ఉన్న భూమి సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉందని వాపోయారు.