
బోధన, పరిశోధనల్లో ఏఎన్‌యూ మేటి
పెదకాకాని(ఏఎన్‌యూ): బోధన, పరిశోధనల్లో ప్రత్యేకత చాటుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పేరొందిందని ప్రొఫెసర్ జి.చెన్నారెడ్డి అన్నారు. వర్సిటీ 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం జరగనుంది. బుధవారం డైక్‌మెన్ హాల్‌లో మీడియా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ గుంటూరు జిల్లా నల్లపాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రంగా ప్రారంభమై, స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిందన్నారు. ప్రాంగణంలో ఆర్ట్స్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ వంటి ఆరు కళాశాలలు ఉన్నాయని చెప్పారు. నేడు రెగ్యులర్ విధానంలో 65 యూజీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు, దూరవిద్యా విధానంలో 43 కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ జ్యోతిర్మయి మట్లాడుతూ వ్యవస్థాపక దినోత్సవానికి పూర్వ వీసీలు, ప్రొఫెసర్లు వేడుకలకు హాజరుకానున్నారని చెప్పారు. ముఖ్యఅతిథిగా వీసీ ఆచార్య కె.గంగాధరరావు హాజరుకానుండగా, పూర్వ వీసీలు ప్రొఫెసర్ డి. రామకోటయ్య, ప్రొఫెసర్ సీవీ రాఘవులు, ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ వి. బాలమోహన్‌దాస్, ప్రొఫెసర్ వై.ఆర్. హరగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొంటారని వివరించారు. సమావేశంలో డాక్టర్ కె. శశిధర్, డాక్టర్ ఎన్.బాబు పాల్గొన్నారు.