
అడుగడుగునా అడ్డంకులు
గురజాల: గురజాలలో వైఎస్సార్ సీపీ తలపెట్టిన అన్నదాత పోరుకు పోలీసులు అడుగడునా అడ్డంకులు కల్పించారు. సోమవారం రాత్రి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. మంగళవారం ఉదయం గురజాలకు వచ్చే అన్ని మార్గాలను మూసివేసి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కొత్త వ్యక్తులు ఎవ్వరూ పట్టణంలోకి అడుగుపెట్టనీయకుండా అడుగడునా తనిఖీలు నిర్వహించారు. కొద్ది మంది నాయకులు, రైతులు పోలీసుల ఆంక్షలను అధిగమించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు.
ప్రజల పక్షానే ఉంటాం
వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉండి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజల పక్షానే ఉంటామని సృష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో వ్యవసాయం పండుగ సాగిందని, చంద్రబాబు పాలనలో దండగలా ఉందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. శాంతియుతంగా ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తామంటే పోలీసులను అడ్డుపెట్టి వినతిపత్రం ఇవ్వకుండా చేశారన్నారు. రైతులకు న్యాయం చేయాలని రైతుల సమస్యలను సత్వరమే కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అడుగడుగునా అడ్డంకులు