
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గృహ నిర్బంధం
పెదకూరపాడు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును గుంటూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేనందున ఆ కార్యక్రమానికి మీరు వెళ్లకూడదంటూ నంబూరు శంకరరావుకి నోటీసులు ఇచ్చారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ రైతు సమస్యలపై వినతిపత్రం అందజేయడానికి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టం రావణకష్టం అయ్యిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఎండలో పడికాపులు కాస్తున్నారన్నారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నాయకులను కార్యకర్తలను ఇలా అరెస్ట్ చేసి ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టిన రైతులు, ప్రజలు పడుతున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని నంబూరు తెలిపారు.
అమరావతి: అమరావతికి చెందిన తురకా కిరణ్ భార్య కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై 2018 నవంబర్ 28వ తేదీ రాత్రి విజయవాడ నుంచి అమరావతి వస్తుండగా పెద్దమద్దూరు వాగు చప్టా వద్ద అమరావతి నుంచి విజయవాడ వెళ్లే ఆటోడ్రైవర్ హూమాయున్‌బాషా ఆటోను అతి వేగంగా అజాగ్రతగా నడిపి కిరణ్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టాడు ఈ ప్రమాదంలో కిరణ్, అతని భార్య, కుమారుడు ఋషికుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఋషికుమార్ చనిపోయాడు. అప్పట్లో అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఫిర్యాది తరుపున లాయర్ ప్రసాద్‌నాయక్ వాదనలు వినిపించగా మంగళవారం సత్తెనపల్లి 2వ అదనపు సివిల్ జడ్జి ఒ.సృజన్‌కుమార్ నిందితునికి 304(అ) సెక్షన్‌తోపాటుగా 338 సెక్షన్‌ల ప్రకారం 18 నెలలు జైలు శిక్ష, రూ.11,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
నరసరావుపేట: ఏళ్ల తరబడి అపరిష్కతంగా ఉన్న ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ‘యూటీఎఫ్ రణభేరి’ కార్యక్రమానికి జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరెడ్డి, ఎం.మోహనరావు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం యూటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యాలయంలో రణభేరి పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్పు సమస్యకు పరిష్కారం చూపడం లేదని బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లో కొనసాగుతున్నారని అన్నారు. మూడు నెలలుగా మినిమం టైం స్కేలు టీచర్లకు జీతాలు లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రపంచబ్యాంక్ సాల్ట్ పథకం రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా మూడో వంతు ప్రైమరీ స్కూళ్లు ఇప్పటికే సింగిల్ టీచర్ స్కూళ్లుగా మారిపోయాయని, సగంపైన హైస్కూళ్లు సింగిల్ సబ్జెక్టు టీచరు స్కూళ్లుగా తయారయ్యాయని తెలిపారు. హైస్కూళ్లలో పనిచేయాల్సిన స్కూలు అసిస్టెంట్లు సర్ ప్లస్ పేరుతో క్లస్టరు టీచర్లుగా, ప్రైమరీ స్కూలు హెడ్మాస్టర్లుగా పనిచేయాల్సిన పరిస్థితులు కల్పించారని తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ ఖాసిం పీర, కోశాధికారి రవిబాబు, జిల్లా సహాధ్యక్షురాలు భాగేశ్వరీదేవి, జిల్లా కార్యదర్శులు తిరుపతిస్వామి, ఆంజనేయులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గృహ నిర్బంధం