
మాజీ ఎమ్మెల్యే బొల్లా గృహ నిర్బంధం
వినుకొండ: వినుకొండ మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకూడదంటూ పోలీసులు అర్ధరాత్రి నోటీసులు అందజేశారు. తెల్లవారుజామునే బొల్లా ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా బందోబస్తు నిర్వహించారు. రైతు పోరుకు అనుమతులు లేవని చెబుతూనే మధ్యాహ్న సమయంలో షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం గమనార్హం.
అడ్డుకోవడం దారుణం
మాజీ ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి రైతుల పక్షాన ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వడానికి వెళుతుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రతిపక్షం ప్రజల పక్షాన అడిగే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన టమటో, ఉల్లి, పొగాకు, కందులు, మామిడి, ధాన్యం వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో రైతు భరోసా కేంద్రాల నుంచి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటుంటే చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. రైతులకు ఎలాంటి న్యాయం చేయలేని ప్రభుత్వం వారి సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షపార్టీ నాయకులను అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు యూరియా వస్తుందని అంటున్నారని యూరియా ఎక్కడ ఉందో చూపించాలని డియాండ్ చేశారు. ఉద్యమాన్ని అక్రమ అరెస్టులతో ఆపలేరని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం పోలీసుల అనుమతితో ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే అన్నదాత పోరులో పాల్గొనేందుకు వెళ్లారు.

మాజీ ఎమ్మెల్యే బొల్లా గృహ నిర్బంధం