
విద్యుత్ సబ్‌స్టేషన్లు చిలకలూరిపేటకు తరలింపు ఆపాలి
●సీఎండి పుల్లారెడ్డికి వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, బొల్లా
●ఎమ్మెల్యే పత్తిపాటి మెప్పుకోసమే చేయటం తగదు
నరసరావుపేట: దశాబ్దాలుగా నరసరావుపేట విద్యుత్ సబ్‌డివిజన్‌లో కొనసాగుతున్న నకరికల్లు, రొంపిచర్ల, ఈపూరు, శావల్యాపురం మండలాల విద్యుత్ సబ్‌స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయనున్న చిలకలూరిపేట విద్యుత్ సబ్‌డివిజన్‌లో కలపడానికి నిరసిస్తూ తక్షణమే ఈ ప్రక్రియను నిలిపివేయాలని నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం విద్యుత్‌శాఖ జిల్లా కార్యాలయంలో సీఎండీ పి.పుల్లారెడ్డి, ఎస్‌ఈ ప్రత్తిపాటి విజయకుమార్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ పై మండలాల విద్యుత్ సబ్‌స్టేషన్లను నరసరావుపేట సబ్‌స్టేష్‌న్ నుంచి తొలగించి చిలకలూరిపేట సబ్‌డివిజన్‌కు తరలించడం దారుణమైన విషయమని అన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి కూత వేటు దూరంలో ఈ నాలుగు మండలాలు ఉన్నాయని, ఇక్కడే విద్యుత్ డీఇ, ఎస్‌ఇ, ఈఈలతోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి వీరిని కలిసి సమస్యలు విన్నవించుకోవడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అన్ని కార్యాలయాలు ఇక్కడ పెట్టుకుని ఇక్కడి ప్రజలు చిలకలూరిపేటకు వెళ్లి సమస్యలు విన్నవించుకోవడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు.
కేవలం చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మెప్పుకోసం చిలకలూరిపేటలో సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, వారికి అంతగా కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేసుకోవాలని ఉంటే అక్కడున్న మండలాలను కలుపుకొని చేసుకోవాలే తప్ప మా నియోజకవర్గాలకు చెందిన మండలాలను తీసుకువెళ్లి అటు కలపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అవసరమైతే ధర్నాలు చేయడానికి, న్యాయపోరాటానికి సైతం వెనుకాడబోమని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.