
పరిశ్రమ వద్ద నీటి సంపులో పడి కార్మికుడి మృతి
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్ పరిధి ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు శ్రీరామ్(21) గురువారం ప్రమాదవఽశాత్తూ నీటి సంపులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. గుంటూరుకు చెందిన శ్రీరామ్ రెండేళ్లుగా మేనకూరు సెజ్ పరిధిలోని బ్రేక్స్ ఇండియా పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. శ్రీరామ్ వెంకటగిరి పట్టణంలో నివాసం ఉంటు ప్రతిరోజూ పరిశ్రమకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే గురువారం విధులకు హాజరై నీటి సంపు సమీపంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. చాలా పైనుంచి నీటి సంపులో పడిపోయిన శ్రీరామ్‌ను అక్కడి కార్మికులు గుర్తించి నీటి సంపు నుంచి బయటకు తీసి హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీరామ్ అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న సీఐ బాబి వైద్యశాలకు వద్దకు వెళ్లి పరిశీలించారు. పరిశ్రమ వద్దకు వెళ్లి అక్కడి నీటి సంపు తదితర ప్రాంతాలను పరిశీలించారు. శ్రీరామ్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.