
యోగా పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ
● జేఎన్‌వీ ప్రాంతీయ స్థాయి యోగా క్రీడల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న వైఎస్సార్ కడప క్లస్టర్ ● ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్ ● త్వరలో జాతీయస్థాయి పోటీలకు అర్హత
యడ్లపాడు: ఆట ఏదైనా పోటీల నిర్వహణ క్రీడాకారులకు ఒక వేదిక మాత్రమేనని.. యోగాను జీవితంలో భాగం చేసుకోవడమే అసలైన విజయమని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి పేర్కొన్నారు. చిలకలూరిపేట రూరల్ మండలం మద్దిరాలలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ పాఠశాలలో హైదరాబాద్ జేఎన్‌వీ రీజియన్ పరిధిలో నిర్వహించిన ప్రాంతీయస్థాయి యోగా క్రీడా ప్రదర్శన పోటీలు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు విభాగాల్లో మూడు రోజుల పాటు కొనసాగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం గురువారం జరిగింది. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగా ఒక దివ్యౌషధంగా ఉపయోగపడుతుందన్నారు. యోగా శిక్షణ యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుందన్నారు. విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు మాట్లాడుతూ యోగా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి నవోదయ జాతీయ క్రీడలకు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. పోటీల నిర్వహణకు సమన్వయంతో కృషి చేసిన విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీఈటీలు ఆర్.పాండురంగారావు, జి.గోవిందమ్మ, అధ్యాపకులు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఎస్కార్ట్‌లను అభినందించారు.
ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన
‘వైఎస్సార్ కడప క్లస్టర్’
జవహర్ నవోదయ విద్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రాంతీయస్థాయి యోగాక్రీడా ప్రదర్శన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ కడప క్లస్టర్‌లోని జేఎన్‌వీ సాధించుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలోని 8 క్లస్టర్ల నుంచి క్లస్టర్ లెవర్ వరకు జరిగిన యోగా పోటీల్లో గెలుపొందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కృష్ణా, వైఎస్సార్ కడప, బీదర్, షిమోగా, తుమ్మకూర్, పట్నంతిట్టా, వైనాడ్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన 278 మంది క్రీడాకారులు పాల్గొని ఆసనాలు, ఆర్టీస్టిక్, రిథమిక్ విభాగాల్లో యోగా విన్యాసాలు ప్రదర్శించి తమ కళాత్మక నైపుణ్యాలను చాటారు. ఆయా పోటీల్లో రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ కడప క్లస్టర్ జేఎన్‌వీ ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను కై వసం చేసుకోగా, కృష్ణా క్లస్టర్ ద్వితీయస్థానంలో నిలిచింది. వీటితో పాటు వివిధ విభాగాల్లో వ్యక్తిగతంగా విజేతలైన 42 మంది త్వరలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు అర్హత సాధించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న 21 మంది విద్యార్థులు, 21 మంది విద్యార్థినులను మెడల్స్, సర్టిఫికెట్లతో సత్కరించారు. అన్ని విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన వైఎస్సార్ కడప క్లస్టర్ విద్యార్థులను, ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్ విద్యార్థులను, షీల్డ్‌లు, సర్టిఫికెట్లతో సత్కరించారు.
చిలకలూరిపేట టౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని జవహర్ పీఎంశ్రీ నవోదయ విద్యాలయం వేదికగా, దక్షిణ భారతదేశంలోని జేఎన్‌వీ విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రాంతీయ స్థాయి యోగా ప్రదర్శన పోటీలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు ఉత్సాహంగా సాగాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటకకు చెందిన 8 క్లస్టర్ల నుంచి 278 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జూలై 29, 30, 31 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన యోగా నైపుణ్యాలను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఆసనాలు, రిథమిక్, ఆర్టిస్టిక్ (కళాత్మక) యోగా ప్రదర్శనలతో వేదికపై మెరుపులు మెరిపించారు. అండర్ –14, అండర్–17, అండర్ –19 విభాగాల్లో గ్రూపు, వ్యక్తిగత విభాగాల్లో బాలబాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీఈటీ ఆర్ పాండురంగారావు, జి.గోవిందమ్మ, ఇతర అధ్యాపకులు పర్యవేక్షించారు.

యోగా పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ

యోగా పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ