
ఇంజినీరింగ్ ప్రవేశాలకు నేటితో తెర
● కళాశాలలను మార్చుకునేందుకు
నేడు చివరి అవకాశం
● మొదటి దశలోనే 90 శాతానికి
పైగా సీట్లు భర్తీ
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారంతో తెర పడనుంది. మేలో జరిగిన ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, వెబ్ ఆన్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఎస్సీహెచ్‌ఈ) ఇటీవల మొదటి విడతలో బీటెక్ సీట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి దశలోనే 90 శాతం మేరకు సీట్లు భర్తీ అయ్యాయి. చివరి దశ కౌన్సెలింగ్‌కు గడువు శుక్రవారం ముగియనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలను కలుపుకుని 36 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు సహా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న 30,240 సీట్లలో 90 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.
కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత
కంప్యూటర్ సైన్స్‌లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈతో పాటు అనుబంధంగా ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా, ఐఓటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. సీఎస్‌ఈ తరువాత ఐటీ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్‌లను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే వివిధ కళాశాలల్లో సీట్లు పొంది, ఇతర కళాశాలల్లో సీటు కోరుకునేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం రాత్రిలోపు కొత్తగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.వీరికి ఈనెల 4న సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు పొందిన కళాశాలల్లో అలాట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చి, అక్కడ చేరకుండా చివరి దశ కౌన్సెలింగ్‌కు వెళ్తున్నామని ముందస్తుగా సమాచారం ఇచ్చిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అర్హులు. చివరి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంది.