
ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన అవసరం
ఇంటర్ విద్య ఆర్‌జేడీ పద్మ
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ విద్యా విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇంట ర్మీడియెట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జె.పద్మ తెలిపారు. పల్నాడుజిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్‌జేడీ జె.పద్మ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతి వారాంతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలనీ, ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు అందిస్తుందన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం మొబైల్ ఫోన్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో హాజరు నమోదు చేయాలని తెలిపారు. అధ్యాపకులు డ్రెస్‌కోడ్ పాటించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ప్రతినెలా రెండు కళాశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గుంటూరు ఆర్‌ఐఓ సునీత మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరగటంతో ప్రవేశాలు సైతం పెరిగాయని తెలిపారు. అధ్యాపకులు నాణ్యమైన విద్యా బోధన అందించాలని కోరారు. డీఐఈఓ ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ, అధ్యాపకులు ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతిపై చర్చించాలని కోరారు.