
యోగా పోటీల్లో సత్తా చాటాలి
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: జాతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీల్లో పతకాల సాధనే లక్ష్యంగా క్రీడాకారులు కృషి చేయాలని చిలకలూరిపేట పురపాలక కమిషనర్ పి.శ్రీహరిబాబు చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం యోగా క్రీడాకారులతో కళకళ లాడింది. జేఎన్‌వీ పరిధిలో జరిగే ప్రాంతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీలకు మద్దిరాల నవోదయ విద్యాలయం వేదికగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఇటీవల జరిగిన క్లస్టర్ స్థాయి యోగా పోటీల్లో విజేతలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
తరలివచ్చిన 278 మంది విద్యార్థులు
29వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం ఐదు రాష్ట్రాలకు చెందిన 278 మంది క్రీడాకారులు, తమ పీఈటీలు, ఎస్కార్ట్‌లతో తరలివచ్చారు. మున్సిపల్ కమిషనర్ ిపి.శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా ప్రదర్శన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు అధ్యక్షత వహించిన విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్.నరసింహారావు స్వాగతోపన్యాసం చేశారు. ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ లింగయ్య చౌదరి, నవోదయ విశ్రాంత సహాయ కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జేఎన్‌వీల విద్యార్థులు యోగా ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో జేఎన్‌వీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీలో దక్షిణ భారత యోగా ప్రదర్శన పోటీలు ప్రారంభం
ఐదు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు

యోగా పోటీల్లో సత్తా చాటాలి