
కోర్టు ఉత్తర్వుల పేరుతో రోడ్డున పడేశారు
సాక్షి టాస్క్‌ఫోర్స్: బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ఇళ్లు కూల్చివేత ఒక పఽథకం ప్రకారం జరిగిందని, కోర్టు ఉత్తర్వుల పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగారని బాఽధితులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన కంభపాటి దాసు, గంగనబోయిన మునెయ్య, నాగరాజు, చెంచినీటి గౌరమ్మ, కంచర్ల గోవిందమ్మ, చొప్పవరపు చిన్నమునెయ్య, నారాయణమ్మలు కొన్నేళ్లుగా రోడ్డు పక్కన ఉన్న స్థలంలో నివాసగృహాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ద్రోణాదుల మల్లికార్జున తన వ్యవసాయ భూమికి అడ్డుగా ఇళ్లున్నాయని వాటిని తొలగించాలని కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ స్థలంలో కట్టుకున్న ఇళ్లను తొలగించమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తమకు అప్పీల్ చేసుకొనే సమయం ఇవ్వాలని కోరామని, అయితే టీడీపీ నేతల ఒత్తిడితో ఈనెల 25 తేదీ అకస్మాతుగా ఇళ్లు కూల్చడానికి జేసీబీలతో వచ్చారంటున్నారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని, దాన్ని అమలు చేయడానికి అడ్డురాబోమని చెబుతున్నారు. అయితే కనీసం ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు తీసుకునే సమయం ఇవ్వకుండా ఆర్ అండ్ బీ, రెవెన్యూ, పోలీసులు అధికారులు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల కూల్చివేత నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కావాలనే మరో అరగంటపాటు ఇళ్లను కూల్చేలా కూటమి నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్‌లో పల్నాడు జిల్లా కలెక్టర్‌ను కలసి మా గోడు వెళ్లగక్కినా ఫలితం లేదన్నారు.
బాధితులకు అండగా ఉంటాం...
బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామస్తుల ఆందోళన ఇంటిలోని సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు గ్రీవెన్స్‌లో కలెక్టరుకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదు
కోర్టు ఆదేశాల పేరుతో నివాస గృహాలను దౌర్జన్యంగా కూల్చివేయడం అన్యాయం. కనీసం ఇంటిలో సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలపై వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఇళ్లను కక్షతో కూల్చడం బాధాకరం. కూటమి నేతలు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ సీపీ తరపున పూర్తిగా అండగా నిలిచి న్యాయపోరాటానాకి సహకరిస్తాం.
–బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే

కోర్టు ఉత్తర్వుల పేరుతో రోడ్డున పడేశారు