
ఉచిత ఇసుక తూచ్!
● కిలోమీటరుకు ఇంతని వసూలు చేస్తున్న ప్రభుత్వం ● రేవుల నుంచి తెచ్చి యథేచ్ఛగా టీడీపీ నేతల ఇసుక దోపిడీ ● వాగులూ, వంకలనూ వదలని అక్రమార్కులు
సత్తెనపల్లి: ఎన్నికల ముందు ఉచితంగా ఇసుక ఇస్తామని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కిలోమీటర్లకు ఖరీదు కట్టి అమ్ముతోంది. భవన నిర్మాణదారుల నుంచి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటుంది. మరో వైపు అధికార పార్టీ నేతలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన తోడేస్తూ.. టిప్పర్లు, లారీల్లో అక్రమంగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
యజమానులకు తప్పని భారం
ఇసుక బుక్ చేసుకోవడం తెలియని యజమానులు అందుబాటులో ఉన్న ఇసుకను కొనుగోలు చేసి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కూటమినేతలు అడ్డదారుల్లో ఇసుకను తీసుకువచ్చి ట్రాక్టర్లలో నిల్వ ఉంచి మరీ అందిన కాడికి దోచుకుంటూ విక్రయాలు చేస్తున్నారు. ఇసుక రేవుల్లోనే కాక వాగులు, వంకలను వదలకుండా ఇసుకు తీసుకు వస్తున్నారు. బుకింగ్ చేసుకుంటే రోజుల తరబడి జాప్యం అవుతుందనే ఉద్దేశంతో భవన యజమానులు అందుబాటులో ఉన్న ఇసుకను అధిక రేట్లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
కృత్రిమ కొరతతో ఇక్కట్లు
సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాలకు ఇసుక పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి మండలాల నుంచి సరఫరా అవుతుంది. ఆయా మండలాల్లోని ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక సరఫరా అవుతుంది. జూన్ 12న కొలువు దీరిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అందరికీ ఉచిత ఇసుక అంటూ బూటకపు హమీ ఇవ్వడంతో భవన నిర్మాణ యజమానులు కొంతకాలం వేచి చూశారు. అయితే కూటమి సర్కారు ఉచితమన్న పదానికి అర్థం మార్చేసింది. ఇసుకకు ధరలు కేటాయించింది. అంతేకాక జిల్లాకు ఒక స్టాక్ యార్డు పెట్టి ఇసుక కృత్రిమ కొరత సృష్టించింది. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేయడంతో కార్మికులు ఇళ్లకే పరిమితమై ఆందోళనలు చేశారు. మొన్నటివరకు ఆషాఢ మాసం కావడంతో గృహ నిర్మాణాలు ప్రారంభించేందుకు యజమానులు ముందుకు రాలేదు. ప్రస్తుతం శ్రావణమాసం రావడంతో భవన నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ఈ క్రమంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తే భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరికే పరిస్థితి ఉండదు.