
తైక్వాండో పోటీల్లో 15 మందికి బంగారు పతకాలు
తెనాలి అర్బన్: గుంటూరు జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెనాలి కేఎస్‌ఆర్ అకాడమి విద్యార్థులు 15 మందికి బంగారు, ఆరుగురికి వెండి, ఇద్దరికి కాంస్య పతకాలు లభించినట్లు కోచ్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. పోటీలను రేపల్లెలో ఈ నెల 19,20 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. వీరందరూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఆదివారం అకాడమి ఆవరణలో క్రీడాకారులకు పతకాలు పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, వీరవల్లి మురళి, కుర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు మంత్రి అభినందనలు
తాడేపల్లి రూరల్: మంగళగిరికి చెందిన యువ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఉండవల్లిలోని ఆయన కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో జెస్సీ రాజ్ సిల్వర్ మెడల్ సాధించినందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు.