
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది
బొల్లాపల్లి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. మండలంలోని వెల్లటూరులో ఇటీవల కూల్చివేసిన నివాస గృహాలను ఆదివారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. బొల్లా మాట్లాడుతూ తెలుగుదేశం దుర్మార్గపాలన చేస్తోందని చెప్పారు. ప్రజలను రక్షించాల్సిన పాలకులు కక్ష సాధింపు చర్యలు చేపట్టారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఇదే స్థలంలో 50 ఏళ్ల నుంచి నివాసముంటున్నారని, రోడ్డుకి ఎలాంటి అడ్డంకులు లేకపోయినా వీరందరిని స్థానికంగా టీడీపీ నాయకుల ప్రోద్బలంతో కోర్టు ఉత్తర్వులు పేరుతో కూల్చివేయడం దారుణమని చెప్పారు. బాధితులు గంగనబోయిన నాగరాజు, మునేయ్యలకు చెందిన ఎద్దులు దొంగతనం చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. కూల్చివేత గురైన బాధితుల్లో నిరుపేదలు, చిరు వ్యాపారులు, సన్న, చిన్న కారు రైతులు, ఎస్సీ, బీసీలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఎంపీటీసీ, సర్పంచి, వలంటీర్‌గా పనిచేశారని, ఇక్కడ నివాసముంటున్నారని కక్ష పూరితంగా కూల్చివేసినట్లు చెప్పారు. కూల్చివేత సమయంలో ఇల్లు ఖాళీ చేసే సమయం ఇవ్వలేదన్నారు. బాధితుల గోడు పట్టించుకోకుండా డబ్బులు బంగారం ఇష్టం వచ్చినట్లు లూటీ చేశారని ఆరోపించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రైవేట్ కేసు వేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం అందించాలని, స్థానిక ఎమ్మెల్యే వీరందరికీ అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు