
వడియరాజులను ఎస్టీ జాబితాలో చేర్చటం తమ కల
సత్తెనపల్లి: వెనుకబడిన వడియరాజులను ఎస్టీ జాబితాలో చేర్చటం తమ కల అని, దాని సాధన కోసం అనేక ఉద్యమాలు చేశామని ఆంధ్రప్రదేశ్ వడ్డెర (వడియరాజుల) సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు వేముల బేబీ రాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర (వడియరాజుల) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్తెనపల్లిలోని ఏఐఎం ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడుగా తన్నీరు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. బేబీరాణి మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నామని, ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారే తప్ప తమకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో తాము 40 లక్షల మంది జనాభా ఉన్నామని, 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రాజకీయ అభివృద్ధిలో భాగస్వామ్యల్ని చేయాలన్నారు. ఎస్టీ సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నామని, 80 శాతం మంది వడ్డెర జాతికి సంబంధించిన నాయకులు కూటమి ప్రభుత్వం రావడానికి చాలా కృషి చేశారన్నారు. రాజకీయంగా వడ్డెర జాతికి ప్రాధాన్యత ఇవ్వా లని, ఒక రాజ్యసభ సీటు, మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియను అమలుపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాసరావు మాట్లాడుతూ వడ్డెర జాతి అభివృద్ధి కోసం అన్ని జిల్లాలు పర్య టిస్తానని, తమకు జరిగిన అన్యాయాన్ని వడ్డెర జాతి అంతా ఐక్యమై ప్రశ్నిస్తుందన్నారు. పల్నాడు జిల్లాలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి ఎస్టీ సాధన కోసం ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డీ.వేలాద్రి, రాష్ట్ర కన్వీనర్ బత్తుల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఉప్పుతల దేవరాజ్, రాష్ట్ర యువజన విభాగ కన్వీనర్ డేరంగుల అంజి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాతర్ల మంజునాథ్, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు వేముల శ్రీదేవి, సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మన్నెం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
వడియరాజులను ఎస్టీ జాబితాలో చేర్చటం తమ కల వడియరాజుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు బేబీరాణి