
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ గ్రామాన ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు సూచించారు. రైతు సేవా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులు(ఏఏ), ఉద్యాన సహాయకులు(వీహెచ్‌ఏ)లకు కృషీభవన్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ముందుగా సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ జూమ్ మీటింగ్ ద్వారా ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలు, సాగు పద్ధతులు, రైతులు పొందిన ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సహకరించాలని కోరారు. అన్ని రంగాలు ఒకే బాటలో పని చేయాలని, ముఖ్యంగా అది ప్రకృతి వ్యవసాయమై ఉండాలని ఆయన తెలిపారు. రసాయనాలు వాడకం తగ్గించి, సహజ జీవన ఉత్పేరకాలు ఉపయోగిస్తే భూమికి కలిగే ప్రయోజనాలను రైతులందరికీ తెలియజేయాలని సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా భూమి ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ రైతులు సాధించిన ఫలితాలను ప్రకతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి వివరించారు. ఇప్పటి వరకు 80 గ్రామ పంచాయతీలు మాత్రమే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఉన్నాయన్నారు. అయితే, ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రాం ద్వారా 233 గ్రామ పంచాయతీలు భాగమవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అంతా కలిసి రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె సూచించారు.ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను గుంటూరు ఏడీఏ మోహనరావు, జిల్లా యాంకర్ గోపీచంద్ వివరించారు. కార్యక్రమంలో జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.