
రెంటపాళ్ళలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి
సత్తెనపల్లి: మిరప నారు దిబ్బల పైకి గొర్రెల మందను వదలడమే కాకుండా వైఎస్సార్ సీపీ శ్రేణులపై సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో టీడీపీ సానుభూతిపరులు మంగళవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు, వల్లెపు రవితేజ, వల్లెపు వీరయ్య మిరప నారు దిబ్బలు సాగు చేస్తుండగా టీడీపీ సానుభూతి పరులైన నంబుల కాటంరాజు, యాగంటి బాబురావు, సైదయ్యలకు చెందిన గొర్రెల మంద పడటంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన కాటంరాజు, బాబురావు, సైదయ్యలు దాడి చేయడంతో వల్లెపు రాంబాబు, వల్లెపు రవితేజ, వల్లెపు వీరయ్యలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ప్రతిగా టీడీపీ సానుభూతిపరులు కూడా ఫిర్యాదు చేశారు. గాయపడి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్సార్ సీపీ నాయకులు కొర్లకుంట వెంకటేశ్వర్లు, కొమ్మెర శివశంకర్, కొమెర వీరాంజి, మారిశెట్టి వెంకట్రావు, వల్లెపు సహదేవుడు, గంగిలి ఏసోబు, చల్లా వెంకటేశ్వర్లు, తదితరులు పరామర్శించారు.