
గురుకులం గోడు పట్టదా?
● మంచాలు లేక నేలపైనే నిద్ర ● బెంచీలు లేక కిందనే కూర్చుంటున్న విద్యార్థులు ● విద్యాలయానికి చేరుకునే మార్గం అధ్వానం ● పనిచేయని ఆర్వో ప్లాంట్‌లు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● అల్లాడుతున్న విద్యార్థులు
యడ్లపాడు: మంచి క్రమశిక్షణకు..సమగ్ర విద్యకు మారుపేరైన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. యడ్లపాడు మండలం బోయపాలెంలోని ఏపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలను విద్యార్థులు చదువు, క్రీడలు తదితర అంశాల్లో ప్రతిభ చాటుతున్నా వసతి కొరత తదితర వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 5 నుంచి పదో తరగతి వరకు 450 మంది వరకు చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం 316 మంది విద్యను అభ్యసిస్తున్నారు. గతంలో భోజనాలు బాగుండలేదంటూ ఇక్కడి విద్యార్థులు 35 మంది గోడదూకి రెండుసార్లు కొండవీడు కొండల్లోకి వెళ్లి నిరసన తెలపడంతో అప్పట్లో రాష్ట్రమంతటా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ప్రిన్సిపాల్‌ను మార్చి దాసరి ప్రభాకరరావును నియమించారు. ఆ తర్వాత పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ఆహారం విషయాలతోపాటు సరిపడా బోధకుల్ని సమకూర్చడంలో ప్రభాకరరావు కృతకృత్యులయ్యారు. మిగిలిన సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేటీకీ ఆయా సమస్యలు పరిష్కారం కాలేదు. సౌకర్యాలు కొరవడి విద్యార్థులు, వాటిని పరిష్కరించలేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. వీటిలో ప్రధానంగా తరగతి గదిలో బెంచీలు లేకపోవడం, లోయర్ క్లాస్ అయినా, హయ్యర్ క్లాస్ అయినా..అందరూ నేలపైనే కూర్చుని చదువుకోవాలి ఒక్క బెంచీ కూడా లేకపోవడం విశేషం. మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఉన్నా ఒక్కటీ పనిచేయక మూలన పడి ఉన్నాయి. మరుగుదొడ్ల తలుపులు పలు ధ్వంసం కావడం, విద్యార్థులంతా వసతి గదుల్లోని నేలపైనే నిద్రించాల్సిన సమస్యలు నెలకొని ఉన్నాయి. ఇక పాఠశాలకు చేరుకునేందుకు ప్రధానమార్గం సమస్య ఉండనే ఉంది. బోయపాలెం–చెంఘీజ్‌ఖాన్‌పేట బీటీరోడ్డు నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పాఠశాలకు ప్రధాన మార్గం లేకపోవడం, వర్షాలు కురిస్తే బైక్‌పై వెళ్లేందుకు ఫీట్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి వందలాది మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉండే ఈ గురుకుల పాఠశాలలో అత్యంత మౌలిక సౌకర్యాలు కొరవడటం బాధాకరమని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాదెండ్ల: నాదెండ్ల మండలంలో రెండు వసతి గృహాలున్నాయి. గణపవరంలో ఎస్సీ బాలుర వసతిగృహం (ఇంటర్, డిగ్రీ కళాశాల) 24 మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. వీరికి ప్రతినెలా హెయిర్ కటింగ్, కాస్మోటిక్స్ కోసం రూ.250 నగదు అందిస్తారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఈ చార్జీలు నేటి వరకూ చెల్లించలేదు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. నాదెండ్లలో ఎస్సీ బాలుర వసతిగృహంలో 90 మంది విద్యార్థులు ఉంటున్నారు. మూడు నుండి పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. జనవరిలో దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు అందించారు. ఇటీవల పాఠశాలలు పునః ప్రారంభం నుంచి మరమ్మతులు నిర్వహించారు. విద్యార్థులకు సరిపడా బాత్రూంలు, మంచినీటి వసతి ఉన్నాయి.
పరదాలే ప్రహరీ..
అమరావతి: అమరావతి మండలంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేశాయి. ధరణికోటలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో 50 శాతం విద్యార్థులు కూడా లేరు. ఎస్సీ హాస్టల్‌లో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మొత్తం 25మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్ భవనం నూతనంగా నిర్మిం చింది కావటం, తక్కువ మంది విద్యార్థులు ఉండటంతో మరుగుదొడ్ల సమస్య లేదు. అలాగే బీసీ బాలుర హాస్టల్‌లో 23 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్‌కు మరమ్మతులు జరగటం వల్ల పెద్దగా సమస్యలు లేవు. అయితే మరుగుదొడ్లలో ఐదు మాత్రమే పనిచేస్తున్నాయి. స్నానాల గదులకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌కు ఉత్తరాన క్రోసూరు రోడ్డు వైపు ప్రహరీ లేకపోవటంతో అకుపచ్చపట్ట కట్టారు. హాస్టల్‌లోకి జంతువులు, ఆకతాయిలు ప్రవేశిస్తున్నారు.

గురుకులం గోడు పట్టదా?

గురుకులం గోడు పట్టదా?

గురుకులం గోడు పట్టదా?

గురుకులం గోడు పట్టదా?