
విషాదం నింపిన వివాదం
శావల్యాపురం: మానవ సంబంధాలు, రక్త సంబంధాలు రోజురోజుకు దిగిజారిపోతున్నాయనటానికి కారుమంచి ఘటన ఉదాహరణ. వివరాలు ఇలా ఉన్నాయి.. అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం ఒకే కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామం వద్ద జాతీయ రహదారి మార్గంపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడిన సంఘటన విషాదాన్ని నింపింది.
గొడవకు దారి తీసిన పరిస్థితులు...
కారుమంచి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు, బత్తుల వెంకటరావు అన్నదమ్ములు. వీరి మధ్య కొన్నేళ్లుగా స్థల వివాదం ఉంది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో రాజీ జరిగినా ఫలించలేదు. సోమవారం అన్నదమ్ముల కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో బత్తుల శ్రీనివాసరావుకు గాయమైంది. ఈ విషయమై శావల్యాపురం పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు చికిత్స కోసం ఆటోలో వినుకొండకు బయలుదేరారు. మార్గంమధ్యలో మినీ వాహనం మృత్యువు రూపంలో కబళించింది. ప్రమాదంలో బత్తుల బ్రహ్మయ్య, బత్తుల నాగమూర్తమ్మ, బత్తుల అంజమ్మ, బత్తుల ముత్యాలమ్మలు మృతి చెందారు. బత్తుల యశోదకుమారి రెండు కాళ్లు విరగగా గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలలో మృత్యువుతో పోరాడుతుంది.
ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి
బత్తుల శ్రీనివాసరావు తల్లి ముత్యాలమ్మ, భార్య నాగమూర్తమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అంతేగాక ఆయన కుమార్తె యశోదకుమారి తీవ్ర గాయాలై మృత్యువుతో పోరాడుతోంది.
మృతదేహాలకు పంచనామా
ఒకే కుటుంభానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు పెద్దలను కోల్పోయి అనాథలుగా మారాయి. మంగళవారం నలుగురు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో శవపంచనామా అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించారు. మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. చూపరులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకరరావు సారధ్యంలో ఎస్‌ఐ లేళ్ల లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గొల్లుమన్న కారుమంచి గ్రామం గ్రామానికి చేరిన మృతదేహాలు

విషాదం నింపిన వివాదం

విషాదం నింపిన వివాదం

విషాదం నింపిన వివాదం