
షేర్లలో లాభాల పేరిట రూ.57.20 లక్షల మేర మోసం
● జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ
నరసరావుపేట రూరల్: తమ సలహాలు పాటించి షేర్లలో పెట్టుబడి పెడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.57.20లక్షలు మోసం చేసినట్టు పిడుగురాళ్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, మోసం, ఆస్తి తగాదాలకు సంబంధించిన 98 ఫిర్యాదులు ఎస్పీకి అందాయి.
కంపెనీ మోసం చేసిందని ఫిర్యాదు
ఎలక్ట్రికల్ బైక్‌లను సరఫరా చేయకుండా, డీలర్‌షిప్ నగదు చెల్లించకుండా కంపెనీ మోసం చేసిందని బెల్లంకొండ మండలం వన్నాయపాలెం చెందిన మేకల సాంబశివరావు ఫిర్యాదు చేశాడు. పంజాబ్‌కు చెందిన అక్కాల్–ఈ– వరల్డ్ పేరుతో ఈటూవైగో పేరుతో ఎలక్ట్రికల్ బైక్‌లను సరఫరా చేస్తామంటే రూ.20 లక్షలు నగదు చెల్లించినట్టు తెలిపారు. కొంతకాలం బాగానే బైక్‌లను సరఫరా చేశారని, గత 8 నెలులుగా బైక్‌ల సరఫరా నిలిపివేసినట్టు వివరించారు. నాలుగు నెలల నుంచి ఫోన్‌కాల్స్ కూడా స్పందించడం లేదని తెలిపారు. ఆన్‌లైన్‌లో డబ్బులు వసూళ్లు చేసి బైక్‌లు ఇవ్వకుండా కొంతమంది కస్టమర్లను మోసం చేసినట్టు తెలిపారు.
రెండో పెళ్లికి సిద్ధమైన భర్తపై చర్యలు తీసుకోవాలని వినతి
తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో భర్త వివాహనికి సిద్ధమయ్యాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట కుమ్మరి బజార్‌కు చెందిన నక్కల చిన్నిపార్వతి ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతానికి చెందిన నాగప్రవీణ్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారని తెలిపింది. నన్ను, పిల్లలను సరిగా పట్టించుకోకపోడంతో పట్టింటి వద్దనే ఉంటున్నానని, ఇప్పుడు వేరే మహిళతో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. నాగప్రవీణ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది.
న్యాయం చేయండి
పిడుగురాళ్లకు చెందిన రిటెర్డ్ ప్రధానోపాధ్యాయుడు స్టాక్ అడ్వైజర్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేయగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన అజాద్‌సింగ్, సుమత్రా అగర్వాల్‌లు రివైవల్ ప్లాన్ అడ్మిన్లుగా పరిచయం అయ్యారు. పెట్టుబడిపై ప్రతి రోజు 5 నుంచి 10 శాతం లాభం తీసుకువస్తామని నమ్మబలికారు. 11 దఫాలుగా రూ.57,.20లక్షలు వారు చెప్పిన అకౌంట్‌లో డిపాజిట్ చేశాడు. తరువాత రోజు ఏ రోజు ఎంత లాభం వచ్చింది వాట్స్‌ఆఫ్ గ్రూప్‌లో మెసేజ్ ద్వారా తెలియజేశారు. ఈ విధంగా ఏప్రియల్ 7వ తేదీకి 49,08,750లు లాభం వచ్చినట్టు, ఏఏ స్టాక్‌లలో ఎంత లాభం వచ్చింది వివరాలు వాట్స్‌ఆఫ్‌లో పంపించారు. పెట్టుబడి, లాభం కలిపి రూ.1.06,28,750 అకౌంట్‌కు పంపుతామని చెప్పి ఫోన్‌లకు స్పందించడం లేదని ఫిర్యాదు చేశాడు.
సీఐపై చర్య తీసుకోవాలి
తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన నరసరావుపేట టూటౌన్ సీఐ హైమారావుతోపాటు తనపై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లిరోడ్డులోని ఆదిత్య అపార్ట్‌మెంట్‌కు చెందిన న్యాయవాది కె.స్నేహరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత వారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన ఫిర్యాదుపై టూటౌన్ పోలీసులను కలిసి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి దూషించిన ఆనం శివపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఎన్నిసార్లు స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. అపార్ట్‌మెంట్ వాసులతో కలసి సీఐ హైమారావును కలవగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని తెలిపారు. అంతేకాకుండా శివ కొంతమందితో కలిసి తన ఇంటిపై దాడికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసారు. సీసీ టీవీని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.