
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌కు ఖండన
నరసరావుపేట రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తున్న నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగనన్నకు తోడుగా నిలుస్తామని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిడ్డారపు గాంధీ తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ, ఎస్‌సీ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సమావేశంలో ఎస్‌సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శామ్యూల్, ఇంగ్లిష్ మీడియం విద్య పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ చాదినబోయిన ఏడుకొండలు యాదవ్, గాంధీ స్మారక సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈదర గోపీచంద్, పార్టీ ఎస్‌సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, నరసరావుపేట నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు మర్రిపూడి రాంబాబు, గురజాల మండల ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు మాచర్ల బాబు, బీసీ నాయకుడు అట్లూరి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయలేదన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడని ఈదర గోపిచంద్ విమర్శించారు. గత ఎన్నికల్లో అక్రమమార్గంలో ఈవీఎంల ద్వారా గెలిచారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఈవీఎంల మోసాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. శామ్యూల్ మాట్లాడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో దాడులు, అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని తెలిపారు.
హామీలపై నిలదీస్తారనే భయంతోనే..
కొమ్ము చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలుపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల అక్రమ కేసులు కొనసాగుతున్నాయని, రెడ్‌బుక్ రాజ్యాంగం ఎంతో కాలం నడవదని స్పష్టం చేశారు. ఏడుకొండలు యాదవ్ మాట్లాడుతూ తిరోగమనంలో పయనిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని తెలిపారు. అనేక కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకులను అణచివేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. దాడులకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
చంద్రబాబు పతనానికి ఇది నాంది
వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ, ఎస్‌సీ సెల్ నాయకులు
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన నాయకులు
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం
రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదని స్పష్టీకరణ