
వేమగిరి వాసులకు ఇళ్లపట్టాలు, పట్టాదారు పుస్తకాలు ఇవ్వాల
నరసరావుపేట: పిడుగురాళ్ల మండలం వేమగిరి వయా గుత్తికొండ గ్రామంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందిన సుమారు 300 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు, సాగుచేసుకుంటున్న భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు రెడ్‌బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారితో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ పి.అరుణ్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. రెడ్‌బాషా మాట్లాడుతూ వేమగిరి గ్రామం అనేది కొత్తగా ఏర్పడింది కాదని, స్వాతంత్రం రాకముందే రాజులు, జమీందారుల పాలనలోనే ఈ గ్రామం ఉందన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమైన కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయని, వీరికి కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్తు, రోడ్డు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వారు నివసిస్తున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. సుమారు నాలుగువేల ఎకరాలు ఇక్కడున్న పేద కుటుంబాలు సాగు చేసుకుంటున్నారని, వాటికి వెంటనే అడవి హక్కుల చట్టంలో 2006 వచ్చిన మార్పును అనుసరించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర వస్తువులు బియ్యం తీసుకునేందుకు వారి గ్రామంలోనే డిపో ఏర్పాటు చేయాలని, గుత్తికొండ గ్రామానికి వెళ్లి తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. యువజన నాయకులు పాస్టర్ రమేష్, గురజాల డివిజన్ ఎంసీపీఐయూ నాయకులు మాచర్ల నాగేశ్వరరావు, యువజన సంఘం నాయకులు షేక్ మహబూబ్ బాషా, వేమగిరి గ్రామ రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
– కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన నాయకులు, గ్రామస్తులు