
చేనేత సహకార సంఘాలకు రూ. 156 కోట్లివ్వాలి
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్
సత్తెనపల్లి: చేనేత సహకార సంఘాలకు రావాల్సిన యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ, రిబేట్ మొత్తం రూ. 156 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం జరిగిన ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమావేశానికి చేనేత కార్మిక సంఘ నేత కట్టా శివ దుర్గారావు అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 6,7వ తేదీలలో సత్తెనపల్లిలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చేనేత రంగాన్ని పరిరక్షిస్తామని, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుకు చర్యలు చేపడతామని కూటమి నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభలలో సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ చేతివృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సామాజిక రక్షణ చట్టంలో కొన్ని వృత్తులకు రక్షణ కల్పిస్తామని చెప్పి 8 మంది మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదన్నారు. కార్పొరేషన్లకు విధివిధానాలు లేకపోవడంతో 56 కార్పొరేషన్ల వల్ల వృత్తిదారులకు ప్రయోజనం జరగలేదన్నారు. రాజకీయ నిరుద్యోగులకు ఉపయోగపడుతున్నట్లు ఆరోపించారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు దూకిపర్తి రామారావు, వాసా గంగాధరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అనుముల వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.