
ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లను వినియోగించుకోండి
నరసరావుపేట: వివాహం అనంతరం కుటుంబాలను సమర్థంగా నిర్వహించుకునేందుకు మిషన్ శక్తికి చెందిన ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లను వివాహాలు చేసుకోబోయే జంటలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కౌన్సెలింగ్ సెంటర్లకు చెందిన పోస్టర్ ఆవిష్కరించారు. దీనిపై జిల్లా మహిళా, శిశుసంక్షేమ సాధికారిత అధికారి ఎం.ఉమాదేవి మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో వివాహానికి ముందు కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. తేరే మేరే సప్నే అని పిలవబడే ఈ కేంద్రాలు వివాహానికి సంబందించిన సామాజిక, మానసిక, ప్రవర్తనా అంశాలపై జంటలకు మార్గదర్శకాలు అందించటమే లక్ష్యంగా ఏర్పాటుచేసిందన్నారు. వివాహం చేసుకోబోయే జంటలకు తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి తొంతరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమర్ధవంతంగా కుటుంబాన్ని నిర్వహించుకునేలా చేస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ఆర్డీఓ కె.మధులత, అధికారులు ఆవిష్కరణలో పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్,
జేసీ, అధికారులు