తలోదారి.. అభివృద్ధి గోదారి
నరసరావుపేటలో కూటమి తీరు
సాక్షి, నరసరావుపేట: రెండు దశాబ్దాల తరువాత పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చదలవాడ అరవింద్‌బాబు గెలుపు వెనుక టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తల సమష్టి కృషి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాన్న నడిపిస్తామని హామీలిచ్చారు. ఏయే ప్రాజెక్టులు చేపట్టబోయేది ఇంటింటికి తిరిగి చెప్పారు. పేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించారు. తీరా ఎన్నికల్లో గెలిచి ఏడాదవుతున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటంటే ఒక్కటి చేయకపోగా గత వైఎస్సార్ సీపీలో పట్టాలెక్కిన పనులను సైతం నిలిపివేశారు. మరి గెలిచిన కూటమి పార్టీల నాయకులు ఏం చేస్తున్నారన్న నరసరావుపేటలో ఎవర్ని అడిగినా కుమ్ములాటల్లో బిజీగా ఉన్నారని ఠక్కున చెబుతారు.
మూడు ముక్కలాట...
తెలుగుదేశం పార్టీలో సాధారణ ఎన్నికలకు ముందే గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే టికెట్ కోసం గ్రూపుల వారిగా ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకున్నారు. ఎన్నికలు పూర్తయినా పేట టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కోడెల శివరాం వర్గాలు విడిపోయాయి. అరవిందబాబుకు ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా ఎంపీ లావు చివరకు ప్రయత్నం చేశాడని, ఆయనతో కలసి పనిచేసేది లేదని అరవిందబాబు వర్గీయులు తేల్చిచెబుతున్నారు. మరోవైపు టీడీపీలో గట్టి పట్టున్న ఓ సామాజిక వర్గాన్ని అరవిందబాబు పట్టించుకోవడంలేదన్న ఆవేదనతో వారు ఎంపీ లావు వెంట నడుస్తున్నారు. చదలవాడను ఎమ్మెల్యేగా అంగీకరించడానికి సైతం వారిలో కొందరికి మనసొప్పడంలేదన్న వాదన వినిపిస్తోంది.
● ఇది ఇలా ఉండగా నరసరావుపేట గడ్డ కోడెల అడ్డా అంటూ కోడెల శివరాం వర్గీయులు గత కొంత కాలంగా స్పీడ్ పెంచారు. కోడెల నియోజకవర్గానికి చేసిన మంచి పనులను సోషల్‌మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో కోడెల విగ్రహాన్ని ప్రారంభించి పట్టునిలుపుకొనే ప్రయత్నం చేశారు. రానున్న ఎన్నికల్లో కోడెల శివరామ్ కే ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కోడెల అనుచరుల హవా కొనసాగిస్తున్నారు. ప్రకాష్‌నగర్ అద్దెభవనంలో కొనసాగుతున్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అక్కడి నుంచి మార్చాలని కోడెల శివరాం పట్టుబడుతుండగా, ఎమ్యెల్యే అరవిందబాబు అడ్డుకుంటున్నాడు. ఈవ్యవహారంలో ఇద్దరి మధ్య అంతర్గతంగా పోరు నడుస్తోంది.
● మరోవైపు ఎన్నికల ముందు టికెట్ ఆశించి భంగపడ్డ నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వరరావులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అధిష్టానం వారికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టకపోవడం, అరవిందబాబు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదన్న కారణంతో వారు స్తబ్ధుగా ఉన్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గ టీడీపీలో మూడు ముక్కలాట
ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, కోడెల శివరాం వర్గాలుగా విడిపోయిన టీడీపీ క్యాడర్
స్తబ్దుగా కడియాల, నల్లపాటి వర్గీయులు
ఎంపీ వెంట నడుస్తున్న జనసేన నేత జిలాని
జిలానీకి వ్యతిరేకంగా ఓ సామాజిక వర్గ నేతలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే చదలవాడ
కూటమి నేతల తీరుతో జిల్లా కేంద్రంలో కుంటుపడిన అభివృద్ధి
ఏడాది కావొస్తున్నా చెప్పుకోదగ్గ ఒక్క పనీ చేయని వైనం
చిత్రాలయ ఆర్‌యూబీ, మల్లమ్మ సెంటర్ ఫ్లై ఓవర్ ఊసే శూన్యం
అభివృద్ధిపై ప్రభావం
రెండుగా విడిపోయిన జనసేన క్యాడర్
నరసరావుపేట ఎమ్మెల్యే సీటు తమదేనని భావించిన జనసేన పార్టీ ఎన్నికల తరువాత రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్ జిలానీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గంగా ముద్రపడి, ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అరవిందబాబుతో అంటీముట్టనట్టు ఉంటున్నాడు. దీంతో జనసేనలో క్రియాశీలకంగా ఉండే ఓ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడన్న ప్రచారం నడుస్తోంది. ఇలా జనసేన నేతలు రెండుగా విడిపోయి ఒకరిమీద ఒకరు అధినేతకు వరుస ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నామినేటెడ్ పదవీ ఒక్కటీ దక్కలేదన్న ఆవేదన సగటు జనసేన కార్యకర్తలలో ఉంది. మరోవైపు తాము ప్రభుత్వంలో భాగస్వామ్యులైనా తగిన ప్రాధాన్యత దక్కడంలేదన్న బాధ బీజేపీ నేతల్లో ఉంది.
కూటమి నేతల అంతర్గత విభేదాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేట అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పల్నాడుకే పెద్దాసుపత్రిగా పేరొందిన ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సరైన వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. సరిపడా మందులు అందుబాటులో ఉండటం లేదు. పట్టణ ప్రజలను వేదిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం మల్లమ్మ సెంటర్‌లో ఫ్‌లై ఓవర్, చిత్రాలయ టాకీస్ వద్ద ఆర్‌యూబీ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జేఎన్‌టీయూ భవనాల పూర్తి, ఆటోనగర్ ఏర్పాటు, కోటప్పకొండ అభివృద్ధి వంటి పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం మారిన తరువాత వాటిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించలేదు. ప్రజాసమస్యలను పూర్తిగా గాలికొదిలేసి న కూటమి నేతలు ఆధిపత్య పోరు నడుపుతున్నా రు. ఇప్పటికై నా కూటమి నేతలు అంతర్గత విబేధాలు పక్కనపెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు.
తలోదారి.. అభివృద్ధి గోదారి


