అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
● జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ● పీజీఆర్‌ఎస్‌లో 410 వినతులు స్వీకరణ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన వినతులను తమ సొంత సమస్యగా భావించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, 48 గంట్లలో పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. నరసరావుపేట నియోజకవర్గస్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమం స్థానిక టౌన్‌న్ హాలులో సోమవారం నిర్వహించారు. దీనికి వివిధ ప్రాంతాలకు చెందిన 410 మంది అర్జీదారుల నుంచి వినతులను కలెక్టరు, జేసీ సూరజ్ గనోరే, ఇతర అధికారులు స్వీకరించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఐ.మురళి, రెవెన్యూ డివిజనల్ అధికారిణి కె.మధులత పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు అందజేయాలి
నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో మూడుసెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండుసెంట్లు చొప్పున సుమారు 3వేలమందికి ఇళ్ల స్థలాలు అందజేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. విప్పర్లపల్లిలో 40ఏళ్ల నుంచి ఉంటున్న ఎస్సీ వర్గాలవారికి పట్టాలు మంజూరు చేయాలి. – కాసా రాంబాబు,
సత్యనారాయణరాజు, సీపీఐ నాయకులు
అసెంబ్లీ తీర్మానం చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. సవరణ బిల్లులోని అంశాలన్నీ రాజ్యాంగ వ్యతిరేకం. ఈ చట్టంతో ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. సవరణ చట్టంకు ముందున్న వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలుచేయాలి.
–షేక్ కరిముల్లా, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు
ఉద్యోగం కల్పించరూ..
మేము దివ్యాంగులం. ఇద్దరం పదోతరగతి వరకు చదువుకున్నాం. మాకెటువంటి ఆదరువు లేదు. ఉపాధి కల్పించి న్యాయం చేయండి. –కనుమూరి గోపి, సంతోషి,
అంధ దంపతులు, అప్పాపురం
రూ.5వేలు బోనస్ ప్రకటించాలి
ప్రభుత్వం మిర్చి రైతుకు ప్రకటించిన మద్దతు ధర రూ.11,784లు ఏమాత్రం గిట్టుబాటు కాదు. రైతుల వద్ద నుంచి రూ.6వేలు, రూ.7వేలకే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌యార్డులో అమ్ముకున్న రైతుల వివరాలు ఆర్‌బీకేలలో ప్రకటించాలి. తక్కువధరకు అమ్ముకున్న ప్రతి రైతుకు క్వింటాకు రూ.5వేలు బోనస్ ప్రకటించాలి. అలా చేస్తేనే రైతు నష్టాల బారినుంచి బయటపడి వచ్చే ఏడాది మళ్లీ సాగుచేయగలడు.
–ఏవూరి గోపాలరావు,
ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి
రెండోసారి అర్జీ ఇస్తున్నా..
ఆరోగ్యం కోసం చేసిన అప్పును తీర్చేందుకు ఉన్న ఇంటిని అమ్ముతానంటే కుమారులు ఒప్పుకోవడం లేదు. నాకు ఐదుగురు కుమారులు, భార్య చనిపోయింది. నా ఇంట్లో ముగ్గురు కుమారులు నివాసం ఉంటున్నారు. నేను రెండో కుమారుడితో ఉంటున్నాను. చేసిన అప్పు తీర్చమంటే తీర్చరు. నేనే తీరుద్దామని ఇల్లు అమ్ముతానంటే చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిపై చిలకలూరిపేటలో పీజీఆర్‌ఎస్ పెట్టిన సమయంలో అర్జీ పెట్టుకున్నా. అధికారులు ఎవరూ స్పందించలేదు.
–దౌరావత్ చినబికారీ నాయక్, చిలకలూరిపేట
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం


