నరసరావుపేట: శ్యావల్యాపురం మండలం గంటావారిపాలెంలో తమకు ఓట్లు వేయలేదనే కారణంతో టీడీపీ నాయకులు ఓ ఎరుకల కుటుంబంపై చేసిన దాడిని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) నాయకులు ఖండించారు. ఆదివారం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు ఈఘటనపై మాట్లాడుతూ గ్రామంలో ఒక ఎరుకల కుటుంబం చికెన్ స్టాల్, చిల్లరకొట్టు ఏర్పాటు చేసుకొని జీవిస్తోందని, వారు గత సార్వత్రిక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తమకు ఓట్లు వేయకుండా వైఎస్సార్‌సీపీకి వేశారనే కారణంతో షాపులు కూల్చివేసి నిర్వాహకుడు నాగేశ్వరరావును తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. సుజాత అనే మహిళ జాకెట్‌లో ఉన్న సెల్‌ని బలవంతంగా లాక్కొని ఆమెపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వేల్పూరు, గంటావారిపాలెం గ్రామాలకు చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం మేరకు కేసు నమోదుచేసి నిందితులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. షాపును కూల్చిన పొక్లెయినర్‌ను సీజ్ చేయాలని, సుమారు రూ.18 లక్షల ఆస్తిని నష్టపరచడమే కాక వారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ఎస్టీ కుటుంబానికి రక్షణ కల్పించాలని పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు.
డిమాండ్ చేసిన దేశభక్త ప్రజాతంత్ర నాయకులు గంటావారిపాలెం ఎస్టీలపై టీడీపీ దాడులకు ఖండన తమకు ఓటు వేయలేదనే కారణంతో దాడిచేశారని ఆరోపణ


