కొల్లూరు: కూటమి నేతలు ఇసుకను అక్రమ మార్గంలో హద్దులు దాటిస్తున్నారు. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం ప్రాంతంలో ఉచిత ఇసుక క్వారీ ఉంది. యంత్రాలతో ఇసుకను భారీ లారీలలో నింపి దొడ్డి దారిలో బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక, కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామాల నడుమ వ్యవసాయ కార్యకలాపాలు, ప్రయాణికుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గాలు మార్గం వారి అక్రమాలకు రాచమార్గంగా మారింది. రోజుకు 100 ఇసుక లారీలు అక్రమంగా తరలివెళుతున్నాయి.
బిల్లులు నిల్
నిబంధనల మేరకు రీచ్‌ల నుంచి ఇసుక రవాణా చేసే వాహనాలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇతర జిల్లాల్లోకి సంబంధిత బిల్లులతో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఉచిత ఇసుక క్వారీలను దక్కించుకున్న కూటమి నాయకులు ఎలాంటి బిల్లులు లేకుండానే బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నారు.
పట్టించుకోని యంత్రాంగం
కృష్ణా జిల్లా నుంచి నదిలోని గాలు మార్గం ద్వారా బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా జిల్లాలోకి వస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా అధిక సంఖ్యలో వాహనాలు గాజుల్లంక, పెసర్లంక, కొల్లూరు, పోతార్లంక, దోనేపూడి, కిష్కిందపాలెం, తోకలవారిపాలెం మీదుగా తరలి వెళుతున్నాయి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు మాత్రం స్పందించడంలేదు. పెసర్లంక–కొల్లూరు రహదారి పనులు జరుగుతున్న తరుణంలో ఇసుక లారీల నుంచి భారీగా కారుతున్న నీరు కారణంగా రోడ్డు మన్నిక ప్రశ్నార్ధకంగా మారుతుంది.
కూలీల కడుపుకొడుతున్నారు
ఉచిత ఇసుక క్వారీలలో తవ్వకాలకు కూలీలను మాత్రమే వినియోగించాలన్న నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు. ఉచిత ఇసుక క్వారీలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు యంత్రాలను వినియోగిస్తున్నారు. నదిలో ట్రాక్టర్లు దిగి కూలీలతో ఇసుక నింపకుండా నది వద్ద అడ్డుగాా గుంతలు తీసి అడ్డుకుంటున్న అధికారులు పక్క జిల్లా నుంచి అక్రమ మార్గంలో 40 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నా అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదు. అధికారుల తీరుపై కార్మికులు మండి పడుతున్నారు.
కృష్ణా జిల్లాలో ఉచిత ఇసుక క్వారీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు తరలింపు గాలు రోడ్డే అక్రమాలకు మార్గం పట్టించుకోని అధికారులు
పరిశీలించి చర్యలు..
నదిలో అక్రమ మార్గం ద్వారా జిల్లాలోకి ఇసుక రవాణాను అరికట్టే విషయంలో రూల్స్‌ను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. మైనింగ్ శాఖాధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి కృష్ణా నదిలో జిల్లా దాటి బిల్లులు లేకుండా వాహనాలు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలిస్తాం.
– బి.వెంకటేశ్వర్లు,
తహసీల్దార్, కొల్లూరు
హద్దులు దాటుతున్న ఇసుక