యడ్లపాడు: ప్రభుత్వ డైట్ కళాశాలలో జిల్లాస్థాయి ‘కళా ఉత్సవ్ 2023– 24’ పోటీలు సోమవారం ప్రారంభమవుతాయని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎం.సుభాని తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ప్రతిభ గల విద్యార్థులను జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులన్నారు. మొత్తం పది కళారూపాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గాత్రం, సంగీతం, నాట్యం (సంప్రదాయ, జానపద) విభాగాలు, బొమ్మలాట, నాటకం (ఏకపాత్రాభినయం) విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన వచ్చునని వివరించారు. ఒక విద్యాసంస్థ నుంచి ఒక్కొక్క కళా రూపంలో ఒక బాలుడు, ఒక బాలిక మాత్రమే విడివిడిగా పాల్గొనాలన్నారు. 2022లో జరిగిన కళా ఉత్సవ్ పోటీల్లో విజేతలైన వారు ఈ ఏడాది పోటీల్లో పాల్గొనడానికి అనర్హులని వెల్లడించారు. కళా రూపానికి సంబంధించి అవసరమైన సామాగ్రిని విద్యార్థులే తెచ్చుకోవాలని సూచించారు. డైట్ అధ్యాపకులు డాక్టర్ కే ప్రసాద్, కె అజయ్‌కుమార్ ఆయా కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తారని వెల్లడించారు.
డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సుభాని వెల్లడి పోటీలకు సిద్ధమైన డైట్ కళాశాల


