నేటి నుంచి కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, సీసీఎల్‌ఎ–ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సూచనల మేరకు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ముఖ్యంగా భూ సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ క్లినిక్‌ను జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ప్రారంభిస్తామన్నారు. ఈ క్లినిక్‌లు ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌తోపాటు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్‌డీఓలు, అధికారులు ప్రతి సోమవారం ఉదయం పది గంటలకు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఆపరేటర్, అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
కాల్ సెంటర్‌లను వినియోగించుకోవాలి
మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను నియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. పీజీఆర్‌ఎస్‌ను కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తామని, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. తమ వివరాలతోపాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీ అందజేయాలని, అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకు రావాలని సూచించారు.


