రైతులకు ఉపయోగపడ్డ ల్యాబ్‌లు
సత్తెనపల్లి: రైతులు ఉపయోగించే విత్తనాలు, ఎరువులు నాణ్యతను పరీక్షించిన తర్వాత సాగు చేపడితే మేలైన దిగుబడులను సాధించే వీలుంటుందనే ఉద్దేశంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షలతో భవన నిర్మాణాలు, రూ.40 లక్షల ఖర్చుతో వివిధ రకాల విలువైన పరికరాలు, రసాయనాలు, కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. 2023లో దీనిని ప్రారంభించిన తర్వాత నెల రోజులకే వివిధ పరీక్షల నమూనాలు రైతుల నుంచి వచ్చేవి. ఇలా జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని క్రోసూరు, గురజాల నియోజకవర్గ పరిధిలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్లలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఇవి జిల్లాలోని రైతన్నలకు నాడు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ల్యాబ్‌లను నిర్లక్ష్యం చేయడంతో భవనాలు, రూ.లక్షల విలువైన సామాగ్రి నిరుపయోగంగా మారాయి.
నిరుపయోగంగా భవనాలు
జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, క్రోసూరు, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్లలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లను చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్లక్ష్యంగా వదిలేశారు. సుమారు రూ. కోటి ఖర్చు పెట్టి నిర్మించిన అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లు నిరుపయోగంగా మారిపోయాయి. ఆయా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ భవనాలు ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లను రైతులు బాగా సద్వినియోగం చేసుకున్నారు. ఎరువులు, విత్తనాల నాణ్యతను పరీక్షించుకొని నివేదికల తర్వాత సాగు చేసుకునేవారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మూడు రకాలుగా జర్మినేషన్, ఫిజికల్ ప్యూరిటీ, మాయిశ్చర్ పద్ధతుల్లో ఇద్దరు అధికారులు పరిశీలన జరిపేవారు. అంతేగాకుండా నత్రజని, పొటాషియం, భాస్వరం సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు రసాయనాలను ఉపయోగించేవారు. ఎరువుల నాణ్యతను గుర్తించి ఆ తర్వాత పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో వాటిలో పనిచేసే కొందరు అధికారులను ఇతర విభాగాలకు డిప్యూటేషన్ వేశారనే విమర్శలు ఉన్నాయి. కేటాయింపులు కూడా లేకపోవడంతో విత్తనాలు, ఎరువుల పరీక్షలకు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులకు ఉపయోగపడ్డ ల్యాబ్‌లు


