నిండా ముంచేసిన కేటుగాళ్లు!
2025లో మోసగాళ్ల చేతిలో దెబ్బతిన్న జిల్లా ప్రజలు రూ.400 కోట్లతో ఉడాయించిన సాయిసాధన చిట్స్ పుల్లారావు రూ.350 కోట్లు ఎగ్గొట్టిన యూపిక్స్ యానిమేషన్ కిరణ్ రూ.120 కోట్లతో పారిపోయిన పిడుగురాళ్ల బంగారు బాబు భారీగా అప్పులు చేసి ఐపీలు పెట్టిన పలువురు వ్యాపారులు బాఽధితులకు న్యాయం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
బంగారం పేరుతో బురిడీ...
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట టౌన్ : 2025 సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పలు భారీ ఆర్థిక మోసాలు వెలుగుచూశాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతల సహకారంతో స్కాంలకు తెరదీశారు. ప్రజల అవసరాలను అనుకూలంగా మార్చుకొని రూ. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట స్కాంలకు కేంద్ర బిందువుగా మారింది. సుమారు రూ. వేయి కోట్ల వరకు బాధితులు ఒక్క ఈ ఏడాదిలో నష్టపోయారు. ఈ ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడింది. అక్రమార్కులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారేగానీ బాధితులకు న్యాయం జరిగేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. డబ్బులు తిరిగిరావన్న వేదనతో ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడగా, మరికొందరు ఇంట్లోని పెళ్లిళ్లు వాయిదాలు వేసుకున్నారు. మరికొందరు ఊర్లు విడిచి వెళ్లిపోయారు.
సాధించలేకపోయారు...
సాయి సాధన చిట్‌ఫండ్ పేరుతో అనధికార చిట్స్ నిర్వహించి పాలడుగు పుల్లారావు సుమారు రూ. 400 కోట్లు మోసానికి ఈ ఏడాది జనవరిలో పాల్పడ్డాడు. అతని వద్ద చిట్‌ఫండ్, డిపాజిట్ల రూపంలో చెల్లించిన సభ్యులంతా నేడు రోడ్డున పడ్డారు. బాఽధితుల ఫిర్యాదుతో పుల్లారావు కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేసి సీఐడీకి బదిలీ చేశారు. రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు తొక్కని గడప లేదు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందర్ని కలిసి విన్నవించారు. చివరకు ముఖ్యమంత్రిని సైతం కలిసినా ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదు. సుమారు రెండు నెలలు జైలులో ఉన్న పుల్లరావు బెయిల్‌పై బయట దర్జాగా తిరుగుతున్నాడు. బాధితులు మాత్రం వడ్డీలు కడుతూ ఆర్థికంగా నలిగిపోతున్నారు.
ఏడాదికి రెట్టింపు పేరుతో...
యానిమేషన్‌లో పెట్టుబడులు పెడితే ఏడాదికి రెట్టింపు చేస్తామని మాయమాటలు చెప్పి యూపిక్స్ యానిమేషన్ కంపెనీ నిర్వాహకుడు కిరణ్ పల్నాడు జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు రూ.350 కోట్లకు పైగా సేకరించాడు. ఇందులో ఒక్క నరసరావుపేటలోనే రూ.200 కోట్లు నష్టపోయిన బాధితులుండటం గమనార్హం. బాఽధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన విజయవాడ భవానీపురం పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే డబ్బును రికవరీ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో పెట్టుబడి పెట్టినవారు నష్టపోయారు.
మహిళా బృందాల పేరిట దగా
డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన రుణాలను పక్కదారి పట్టించి సుమారు రూ.10 కోట్లకు పైగా దోచుకున్న మెప్మా స్కాంపై ఇటీవలే విచారణ మొదలైంది. దీనిలో అధికార పార్టీకి చెందిన మహిళా నేతల హస్తం ఉన్నట్టు ప్రాథమికంగా వెల్లడైంది. మెప్మా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బ్యాంక్ అధికారులను మేనేజ్ చేయడంతోపాటు నకిలీ గ్రూప్‌లను సృష్టించి రూ.కోట్లను కాజేశారు. ముఖ్యంగా నరసరావుపేట, అమరావతి, పిడుగురాళ్ల, క్రోసూరు తదితర మండలాల్లో భారీ స్కాం జరిగినట్టు తెలుస్తోంది. ఖాతాదారులకు అధిక వడ్డీ ఆశచూపి భారీ మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేకరించిన ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్, సిబ్బంది వాటిని తమ ఖాతాలకు మళ్లించి స్కాం చేశారు. సుమారు రూ.28 కోట్లు పక్కదారి పట్టించారు. నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాలకు చెందిన అనేక మంది ఖాతాదారులకు బాండ్స్ అంటగట్టి బ్యాంక్ సిబ్బంది, అధికారులు మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో సీఐడికి అప్పగించి విచారణ చేపట్టారు.
రైతులకు డబ్బులు ఇవ్వకుండా..
మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారైన ఘటన ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో బయటపడింది. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన 13 మంది రైతులకు సుమారు రూ.41.30 లక్షలను వ్యాపారి తిరుమలరావు ఎగ్గొట్టాడు. ఇలాంటి ఘటలను జిల్లాలో ఈ ఏడాది మరికొన్ని చోటు చేసుకోవడంతో రైతులు మోసపోయారు.
ఈ ఏడాది జిల్లా ప్రజలను కేటుగాళ్లు నిండా ముంచేశారు. వారి మాయాజాలానికి ఎందరో అభాగ్యుల జీవితం రోడ్డుపాలైంది. అధిక వడ్డీ, రాబడి అంటూ ఆశ చూపి ఉన్నదంతా దోచుకున్నారు. నమ్మకంగా పెట్టిన రూ.వందల కోట్ల పెట్టుబడి కళ్ల ముందే ఆవిరైంది. అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా బాధితులకు కనీస ఊరట కూడా దక్కలేదు.
పిడగురాళ్ల పట్టణానికి చెందిన పెరుమాళ్ల రాజేష్ బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు వసూల్ చేసి ఐపీ పెట్టాడు. అధికారికంగా 26 మందికి సుమారు రూ.80 కోట్లు ఐపీ పెట్టాడు. అనధికారికంగా సుమారు 40 మందికి రూ.150 కోట్ల వరకు సేకరించినట్టు సమాచారం. యడ్లపాడు రచ్చబండ సెంటర్ సమీపంలో స్వర్ణకారుడైన ఏలూరి కామేశ్వరరావు ఆభరణాలు తయారు చేస్తానని సుమారు రూ.3.84 కోట్ల వసూలు చేశాడంటూ 84 మంది బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు గత బుధవారం పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషనుకు చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నిండా ముంచేసిన కేటుగాళ్లు!


