మనిషిని ముందుకు తీసుకెళ్లిన సైన్స్
గుంటూరు ఎడ్యుకేషన్: ఆదిమ కాలపు మానవుడి నుంచి ఆధునిక యుగంలోకి మనిషిని ముందుకు నడిపించడంలో ప్రశ్నించుకునే విధానం, శాసీ్త్రయత ద్వారా పురోగతి సాధ్యపడిందని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ వద్ద ఉన్న రెవెన్యూ కల్యాణ మండపంలో కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఎం.క్యూరీ సంకలనం చేసిన ’మానవతా మూర్తి మేడం క్యూరీ’ పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్, ‘ఆధునిక భారత శాస్త్రవేత్తలు‘ పుస్తకాన్ని చలపతి విద్యాసంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు, ‘బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక‘ పుస్తకాన్ని మలినేని విద్యాసంస్థల అధినేత మలినేని పెరుమాళ్లు ఆవిష్కరించారు. భౌతికశాస్త్రంలో విశిష్ట సేవా పురస్కారాన్ని రాయపాటి శివ నాగేశ్వరరావుకు ప్రదానం చేయడంతోపాటు 30 మంది భౌతికశాస్త్ర ఉపాధ్యాయులను ’సీవీ రామన్, మేడం క్యూరీ’ ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. సభకు అధ్యక్షత వహించిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మానవ నాగరికత అభివృద్ధి చెందిన విధానంలో సైన్స్ కీలకపాత్ర పోషించిందని చెప్పారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమాజంలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. కొన్నేళ్లు సెన్స్ ఫెయిర్స్ నిర్వహిస్తూ, విజ్ఞానాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రస్తుత ఏడాది విశిష్ట సేవా ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు వివరించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక దశాబ్దాలుగా విద్యార్థుల్లో, యువతలో శాసీ్త్రయ ఆలోచన విధానం పెంపొందించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి కె.అలీన్, కె.విజయలక్ష్మి, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత కె.వెంకటేశ్వరరావు, జయలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీవీ రమణ సారధ్యంలో ఎంవీఎస్ కోటేశ్వరరావు పాఠశాలతోపాటు మలినేని పెరుమాళ్లు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఉర్రూతలూగించాయి.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు
కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ టీచర్లకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం
ఎం.క్యూరీ సంకలనం చేసిన మూడు పుస్తకాల ఆవిష్కరణ


