ముగిసిన ఏఎన్‌యూ అంతర్ కళాశాలల బేస్‌బాల్ టోర్నీ
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలోగల చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల బేస్‌బాల్ మెన్స్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ విద్యాధర్ మాట్లాడుతూ ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో జరిగాయని తెలిపారు. పోటీలలో పాల్గొన్న అన్ని టీముల నుంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న జట్టు జనవరి రెండో తేదీన పూనేలోని సావిత్రి భాయిపూలే యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొంటుందన్నారు. ఆదివారం జరిగిన పోటీలలో ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, తృతీయ స్థానంలో నరసరావుపేటకు చెందిన వాగ్దేవి డిగ్రీ కళాశాల నిలిచింది. క్రీడలను కళాశాల పీడీ ఏడుకొండలు నిర్వహించగా, అబ్జర్వర్‌గా యూనివర్సిటీ యోగా కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరావు, సెలక్షన్ కమిటీ మెంబర్స్‌గా డాక్టర్ పాతూరి శ్రీనివాస్, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ మెర్సిన్ బాబులు విధులు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల పీడీ డాక్టర్ గౌరిశంకర్, డాక్టర్ శివరామకృష్ణ, మల్లికార్జునరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


