న్యూస్‌రీల్
పన్నెండు నెలలు..
పదమూడు పండగలు..!
భువనేశ్వర్: పండగలకు ఎప్పుడూ ముగింపు పలకని నేల ఒడిశా. ఒక పండగ ముగిసిందంటే మరో సంప్రదాయం తలుపు తడుతుంది. పవిత్ర కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ఆరంభం కాగానే ఒడిశా ఇళ్లలో భక్తి, కళ, వ్యవసాయ సంస్కృతి మరోసారి కలగలిసిపోతాయి. మార్గశిర మాసపు తొలి గురువారం మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తూ ఇళ్లను శుభ్రపరచి, పూజా మందిరాలను అలంకరించి, లక్ష్మీదేవిని ఆహ్వానించే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. మార్గశిర గురువారాల్లో ఒడిశా ఇళ్ల ముంగిళ్లు, గోడలు తెల్లని ఝోటి–చితా (ముగ్గులు) అలంకరణలతో కళకళలాడుతాయి. బియ్యపు పిండితో గీసే ఈ సంప్రదాయ చిత్రాలు కేవలం అలంకరణలు కావు. ఇంట్లోకి ఐశ్వర్యం, శుభం, సౌభాగ్యం రావాలనే భక్తి భావానికి ప్రతీకలు. ప్రకృతి, పంటలు, పశుపక్ష్యాదులు, పాదముద్రలు వంటి ఆకృతులతో రూపొందించే ఈ చిత్రాల్లో గ్రామీణ జీవన సౌందర్యం ప్రతిబింబిస్తుంది. కొన్ని కుటుంబాల్లో తొలి గురువారం నుంచే మానబొసా గురువారం వ్రతం ప్రారంభమవుతుండగా, మరికొన్ని కుటుంబాలు ప్రథమాష్టమి అనంతరం ఆచరిస్తాయి. విధానాల్లో స్వల్ప తేడాలున్నా, అంతర్లీన భావం మాత్రం ఒక్కటే. ఇల్లు, ఇల్లాలు, ఇలవేల్పు, పంట, సంపద అన్నీ లక్ష్మీ అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలి.
ఆయురారోగ్యాల కోసం ప్రథమాష్టమి
మార్గశిర మాసపు సంప్రదాయాలకు ముందు ఒడియా కుటుంబ జీవనంలో ప్రత్యేక స్థానం పొందినది ప్రథమాష్టమి. ఇంటి పెద్ద కుమారుడి శ్రేయస్సు, ఆయురారోగ్యాలు, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తల్లులు, కుటుంబంలోని పెద్దలు నిర్వహించే ఈ పర్వం అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో ఎండురి పిఠా వంటి సంప్రదాయ వంటకాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. కొత్త పంటల కాలంతో ముడిపడిన ఈ ఆచారం, కుటుంబ పెద్దల ఆశీస్సులు, పిల్లల సంక్షేమం, ఇంటి సౌభాగ్యం అనే మూడు భావాలను ఒకే చోట కలుపుతుంది. ప్రథమాష్టమి కేవలం ఒక కుటుంబ వేడుక కాదు. కుటుంబమే సంస్కృతికి తొలి పాఠశాల అనే భారతీయ భావనకు ఇది అందమైన ప్రతిబింబం.
ధానవేణీ.. పంటకు పూజ
మార్గశిర తొలి గురువారానికి మరో ప్రత్యేకత ‘ధానవేణీ’. కొత్తగా పండిన వరి పంటలోని బంగారు కంకులను జాగ్రత్తగా ఏరి, వాటిని అందంగా కట్టి ధానవేణీగా రూపొందిస్తారు. దానిని భక్తిశ్రద్ధలతో పూజా మందిరంలో ప్రతిష్టించి ధాన్యలక్ష్మికి ప్రతీకగా పూజిస్తారు. ఇది ఒక సాధారణ గ్రామీణ ఆచారం మాత్రమే కాదు. రైతు చెమటతో పండిన ధాన్యాన్ని దేవతా స్వరూపంగా చూసే భారతీయ వ్యవసాయ సంస్కతికి ప్రతిబింబం. నేలను తల్లిగా, ధాన్యాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించే భావన దేశంలోని అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఒడిశా సంప్రదాయాలను ప్రత్యేకంగా నిలబెట్టేది వాటిలో కనిపించే ఈ సమగ్రత. ‘బొరో మాసొ – తేరొ పొర్బొ’ – పన్నెండు నెలలు, పదమూడు పండగలు అనే ఒడియా నానుడి ఈ జీవన విధానానికే ప్రతిబింబం. ప్రతీ రుతువుకూ ఒక వేడుక, ప్రతీ మాసానికీ ఒక సంప్రదాయం, ప్రతీ ఆచారానికీ ఒక కథ, ప్రతీ పండుగ వెనుక ఒక సామాజిక, ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది.
ఒడిశాలో మార్గశిరం నుంచి పండగలు ఆరంభం
సంప్రదాయబద్ధంగా ఇళ్లలో పూజలు
మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ గురువారపు వ్రతాలు


