కొత్త కార్యవర్గ సభ్యులకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

కొత్త కార్యవర్గ సభ్యులకు అభినందనలు

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

భువనేశ్వర్‌: తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్‌ కాంగ్రెసు ప్రధాన కార్యాలయ శాఖ, భువనేశ్వర్‌ శాఖలలో ఖాళీగా ఉన్న పదవుల్ని భర్తీ చేశారు. కార్యవర్గ సభ్యుల అంగీకారం ప్రాతిపదికన ఇద్దరు మహిళలు ఎంపికై నట్లు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రమేష్‌ చంద్ర సాహు ప్రకటించారు. వారిలో మమతా నాయక్‌ ప్రధాన కార్యాలయ శాఖ సహాయ కార్యదర్శిగా, హేనా దాస్‌ భువనేశ్వర్‌ శాఖ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ ఇద్దరు మహిళలు చాలాకాలంగా సంస్థతో అనుబంధం కలిగి పాలనా యంత్రాంగంతో ప్రత్యక్ష సంప్రదింపులు జరిపి ఉద్యోగుల ప్రాథమిక సౌకర్యాల కోసం తమ డిమాండ్ల పరిష్కారానికి చేస్తున్న నిరంతర కృషితో తోటి ఉద్యోగుల విశేష ఆదరణకు నోచుకున్నారని ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సాహు అభినందించారు. ఖుర్దారోడ్‌ మండల సమన్వయకర్త సునీల్‌ భంజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు. మీడియా సెల్‌ ఇన్‌చార్జి లక్ష్మిధర మహంతి, కేంద్ర శాఖ కార్యవర్గ సభ్యులు ఎంజీకే రావుతోపాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

తుఫాన్‌ నివేదికలు అందించాలి

పర్లాకిమిడి: గంజాం జిల్లాలోని అన్ని సమితుల్లో తుపాను బాధితుల సహాయార్థం జాబితా విడుదల చేయాల్సి ఉందని, దీనిపై తుపాను నష్టాలు, బాధితుల జాబితా శుక్రవారం సాయంత్రం నాటికి అధికారులు అందజేయాలని కలెక్టర్‌ వి.కీర్తివాసన్‌ ఆదేశించారు. ఛత్రపురం కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన తుపాను సమీక్షా సమావేశంలో జిల్లాలో అన్ని సమితిల నుంచి అధికారులు పాల్గొన్నారు. ఏ ఒక్క బాధితుడికీ తుపాను సహాయం అందలేదని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. బరంపురం మహానగర్‌ నిగం నష్ట పరిహారం మినహాంచి, అస్కా, భంజనగర్‌, పురుషోత్తంపూర్‌ తదితర బ్లాకుల్లో బాధితుల నష్టానికి సంబంధించి వెంటనే నివేదికలు పంపాలన్నారు. నివేదిక అందిన వెంటనే పరిశీలించి డిసెంబర్‌ 2, 3 తేదీల్లో బాధితుల అకౌంట్లలో నష్ట పరిహారం డీబీటీ ద్వారా అందేలా చూడాలన్నారు. గంజాం జిల్లాలో సంభవించిన రెండు తుపాన్లు అనంతరం బాధితులకు ఆహారం, బియ్యం పంపిణీ సహాయం, పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్‌ను చూసి రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ మంత్రి సురేష్‌ పూజారి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దేవదత్తపండా, సునీల్‌ కెర్కటా, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సుధీర్‌కుమార్‌ జెన్నా తదితరులు పాల్గొన్నారు.

తులకొండపల్లి రైల్వే వంతెన పరిశీలన

కొరాపుట్‌: తులకొండపల్లి రైల్వే వంతెన ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ సమితి సరిహద్దులో చటువ గ్రామ పంచాయతీ తులకొండపల్లి వద్ద పతాలి నదిపై రైల్వే వంతెన ఉంది. కింది భాగంలో ఆర్డీ విభాగం రోడ్డు వెళ్తుంది. భారీ వర్షాలు పడినప్పుడు నదిలో నీరు పెరిగి ఆర్డీ రోడ్డుపై సుమారు 7 అడుగుల నీరు ప్రవహిస్తుంది. దీంతో చటువా, ఖిన్బార్‌ పంచాయతీలకు చెందిన తులకొండ పల్లి, గతిక కొండపల్లి, ఏక్టాగుడ, చిడిఖల్మ, దమ్నిజొల, పొడ్గుడ, దుమెజొలా, నువా కాలనీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ సమస్యతో వర్షాకాలం వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు డిమాండ్లు చేస్తున్నారు. కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో రాష్ట్ర అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. సమస్య తీవ్రత పరిశీలించిన అధికారులు సమగ్ర నివేదికని ప్రభుత్వానికి పంపారు. దీంతో రైల్వే అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్డీ, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, జల వనరుల విభాగాలు అధికారులు, 9 పంచాయతీల ప్రజా ప్రతినిధులు కలిసి ఈ ప్రాంతంని సంయుక్తంగా పరిశీలించారు. ప్రజలు తమ సమస్యలు అధికారులకు వివరించారు. ఈ సమస్య పరిష్కరిస్తామని అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement