● పశుపోషణలో అప్రమత్తత కీలకం
● వ్యాధులపై జాగ్రత్తలు తప్పనిసరి
ఎచ్చెర్ల: పంటల సాగులో ఆరుగాలం శ్రమించే అన్నదాతకు పాడి ఓ నేస్తంలా తోడుంటుంది. వ్యవసాయానికి అప్పులు చేసి పెట్టుబడి పెడుతుంటే.. పాడి మాత్రం అమ్మలా ఆదుకుంటుంది. నిత్య ఆదాయంతో పాడి రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తుంది. అయితే పాడి పశువుల పోషణ, సంరక్షణపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. చూడి పశువు నుంచి లేగ దూడల సంరక్షణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆశ్రద్ధ చేసినా.. వ్యాధులను నిర్లక్ష్యం చేసినా పాడి రైతుకే నష్టం వాటిళ్లుతుంది. ప్రధానంగా లేగ దూడల పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తే రాబోయే కాలానికి మంచి పాడి పశువును పొందే అవకాశం కలుగుతుంది. చిన్నప్పటి నుంచి మంచి దాణా, వ్యాధి నిరోధక టీకాలతో దూడలను మేపితే అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువును పొందే అవకాశం వస్తుంది. లేగ దూడల సంరక్షణ, వ్యాధులు, వాటి నివారణ గురించి మండల పశువైద్యాధికారి వి.రమణ వివరించారు.
తెల్లని విరేచనాలు
దూడలకు మోతాదుకు మించి పాలు తాగించడం వల్ల అజీర్తి చేసి తెల్లగా పారుకుంటాయి. సూక్ష్మజీవులు, నట్టల వల్ల కూడా దూడల్లో పారుడు వ్యాధి సోకుతుంది. విరేచనాలు గమనిస్తే పాల మోతాదును తగ్గించి గ్లూకోజ్, ఉప్పు కలిపిన నీటిని దూడకు పట్టించాలి. వెంటనే పశువైద్యుని దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. పాలలో ఒక టీ చెంచా మోతాదులో యాంటిబయోటిక్ మందును కలిపి వరుసగా 5 రోజులు తాగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాధి రాకుండా నివారించవచ్చు. నట్టల మందును డాక్టర్ సలహా ప్రకారం పట్టించాలి.
న్యూమోనియా..
దూడలకు చలి, ఈదురు గాలులు సోకితే న్యూమోనియా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల దూడలను చలి, ఈదురు గాలులు తగలని ప్రదేశంలో కట్టాలి. వాటికి రాత్రిపూట వసతి కల్పించాలి. న్యూమోనియా వచ్చిన దూడలకు జ్వరం వస్తుంది. శ్వాస పీల్చడం కష్టమవుతుంది. వ్యాధి ముదిరితే చనిపోయే ప్రమాదం ఉంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స చేయించాలి.
బొడ్డువాపు వ్యాధి
దూడ పుట్టినపుడు దాని బొడ్డును శుభ్రమైన బ్లేడు లేదా కత్తెరతో 2 అంగుళాల పొడవుంచి కత్తిరించాలి. దానికి టింక్చర్ అయోడిన్ పూయాలి. ఇలా చేయకపోతే బొడ్డు ద్వారా సూక్ష్మజీవులు ప్రవేశించి బొడ్డువాపు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. బొడ్డు వాపు వచ్చినపుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే చికిత్స చేయించాలి.
మల బద్దకం
దూడల్లో మల బద్దకం సర్వసాధారణంగా కనిపిస్తుంది. చలికాలంలో గేదె దూడల్లో మలబద్దక సమస్య ఎక్కువగా ఉంటుంది. దూడకు జున్నుపాలు తగినన్ని తాగిస్తే మల బద్దకం రాదు. దూడ తాగుపాలల్లో కోడిగుడ్డు సొన, ఇంగువ, బెల్లం, కలిపి రెండు రోజులు తాగిస్తే వ్యాధి నయమవుతుంది. లేదంటే ఎనిమా ఇప్పించాలి.
నట్టల బెడద
దూడలకు నట్టల బెడద సర్వ సాధారణంగా కలుగుతుంది. ఈ సమస్య గేదె దూడల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నట్టలు ఉన్నట్లయితే తరచూ విరేచనాలు వచ్చి దూడలో ఎదుగుదల లోపిస్తుంది. వెంట్రుకలు బిరుసుగా తయారవుతాయి. కడుపు కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరి ఉంటుంది. దూడల్లో నట్టల నివారణకు సకాలంలో నట్టల నివారణ మందులు తాగించాలి. మొదటిసారిగా 8–10 రోజుల వయస్సులోను, ఆ తర్వాత ప్రతీ నెలకు ఒకసారి చొప్పున నాలుగు నెలలపాటు క్రమం తప్పకుండా తాగించాలి.
కాక్సిడియోసిస్
ఈ వ్యాధి సోకడం వల్ల దూడలు రక్త విరేచనాలతో బాధపడతాయి. నివారణకు 15 రోజులకొకసారి పశువుల కొట్టంలో సున్నం చల్లితే వ్యాధి సోకకుండా చేయవచ్చు.
పేలు సమస్య
గేదె దూడల్లో మూడు నెలలు దాటిన తర్వాత ప్రతి నెలకొకసారి చొప్పున ఏడాది వయస్సు వరకూ దాని శరీరంపై వెంట్రుకలను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పేలు, గోమార్లు రాకుండా కాపాడుకోవచ్చు.
దూడల్లో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించినా సకాలంలో చికిత్స అందించాలి. న్యూమోనియా, బొడ్డువాపు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. దూడల సంరక్షణలో పశువైద్యుల సలహాలను పాటించాలి.
– వి.రమణ,
మండల పశువైద్యాధికారి, ఎచ్చెర్ల


