హిరమండలం : గొట్టా బ్యారేజీ ఆపదలో పడుతోంది. మొన్నటి వరదలకు ఇసుక మేట వేసిందనే నెపంతో ఇష్టానుసారం తవ్వుకుపోతున్నారు. బ్యారేజీకి కూతవేటు దూరంలో రోజుకు వందల వాహనాల్లో ఇసుక తరలించుకుపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీని వెనుక నియోజకవర్గ కీలక నేత హస్తం ఉన్నట్టు ఆరోపణలున్నాయి.
అనుమతులపై సందేహాలు..
హిరమండలం మండలం మహాలక్ష్మీపురం సమీపంలో వంశధార నదీ తీరంలో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. ఇందుకు సంబంధించి భగీరథపురం గ్రామం వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటుచేశారు. అయితే ఇక్కడ అనుమతుల విషయంలో అనేక రకాల సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడి ఇసుక రీచ్ గొట్టా బ్యారేజీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది నిబంధనలకు విరుద్ధం కూడా. ఇలా తవ్వకాలు చేపడితే బ్యారేజీకే ప్రమాదం. మరోవైపు ఇసుక మేటలు వేశాయని కారణం చూపి ఇక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. కానీ ఇందుకు నిర్ధిష్టమైన స్థలం పేరు ఉత్తర్వుల్లో రాయలేదు. అలాగని మహాలక్ష్మీపురం సమీపంలో నదిలో ఎలాంటి ఇసుక మేటలు లేవు. గొట్టా బ్యారేజీ నుంచి వచ్చే నీటి ప్రవాహం నేరుగా మహాలక్ష్మీపురం, భగీరథ పురం, పిండ్రువాడ, అక్కరాపల్లి వైపు గట్టు కోతకు గురవుతోంది. ఏటా ఆ గ్రామాల్లో పొలాల్లో వరద నీరు చేరుతోంది. అలాంటిది ఎలా అనుమతిచ్చారన్నది అనుమానం. ఆపై ఇసుక మేటల తొలగింపు పేరిట ఇచ్చిన అనుమతుల్లో నిర్దిష్టంగా తవ్వకాలు ఎక్కడ చేయాలో చెప్పకపోవడం కూడా అనేక సందేహాలకు కారణం అవుతోంది.
పిల్ల కాలువను కప్పేసి..
ప్రస్తుతం జిల్లాను సస్యశ్యామలం చేస్తోంది గొట్టా బ్యారేజీ. అలాంటిది బ్యారేజీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఇక్కడ ఇసుక తవ్వకాలు చేపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఇది వర్షాల సమయం. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం నదుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. పైగా వంశధార ఎడమ కాలువకు సంబంధించి పిల్ల కాలువను కప్పేశారు. చిన్నపాటి పైపు వేసి గ్రావెల్‌తో నింపేశారు. రహదారిగా మార్చేసి ఇక్కడ నుంచి ఇసుక తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా సాగునీటి శాఖ అధికారులు గానీ.. అటు భూగర్భ గనుల శాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. దీని వెనుక పెద్ద తలకాయ ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది.
‘గొట్టా’కు కూతవేటు దూరంలో
ఇసుక తవ్వకాలు
ఇసుక మేటలు పేరుతో అడ్డగోలుగా దోపిడీ
హరిత ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా చర్యలు
చాలా అన్యాయం
ఇంతకంటే అన్యాయం ఉంటుందా? పేరుకే ఉచితం. ఇక్కడ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అసలు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? లేకుంటే బలవంతంగా తవ్వుతున్నారా? అన్నది తెలియడం లేదు. కాలువను కప్పేసి రహదారులు ఏర్పాటు చేసి తరలించుకుపోతున్నారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది. అసలు నదిలో ఎక్కడ ఇసుక మేటలు వేసింది. ఇసుక మేటలు వేస్తే ఏటా మా పొలాలపై వరద ఎందుకు ముంచుకొస్తుంది? గొట్టా బ్యారేజీకి ప్రమాదంగా భావిస్తున్న ఈ రీచ్‌కు అనుమతులు ఇవ్వడం ఎవరికి ప్రయోజనం.
– మీసాల భాస్కరరావు, రైతు, భగీరథపురం


