అన్న కోసం తమ్ముడు! | - | Sakshi
Sakshi News home page

అన్న కోసం తమ్ముడు!

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

● అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి రియాన్‌ యశ్వంత్‌

● తమ్ముడు బోన్‌మ్యారో

మ్యాచ్‌ కావడంతో చిగురించిన ఆశలు

● చికిత్సకు రూ.25 లక్షలు వరకు

అవసరం

● దాతల సాయం కోసం ఎదురుచూపు

ఎచ్చెర్ల : ఆ పసివాడికి ఊహా తెలిసినప్పటి నుంచి ఆస్పత్రి గదులు, సూదులు, మందులే లోకమయ్యాయి. తన తోటి పిల్లలంతా ఆటపాటలతో తిరుగుతుంటే ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రతి నెలా రక్తం ఎక్కించుకుంటూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ కన్న తల్లిదండ్రులు కన్నీటి ప్రయాణంలో అన్నకు ప్రాణం పోయడానికి అన్నట్లుగా పుట్టిన రెండేళ్ల తమ్ముడు ఇప్పడు ఆశాకిరణంగా నిలిచాడు. అయితే చికిత్సకు అయ్యే భారీ ఖర్చు ఆ కుటుంబాన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టింది. దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళితే..

ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎంపురం సమీపంలోని రాజీవ్‌ స్వగృహ కాలనీలో నివాసం ఉంటున్న పలివెల చిరంజీవిరావు తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఈయన శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో పనిచేస్తున్నారు. కుమారుడు రియాన్‌ జశ్వంత్‌ ఎనిమిదేళ్లుగా ‘ప్యూర్‌ రెడ్‌సెల్‌ అప్లాసియా’ అనే అత్యంత అరుదైన రక్త సంబంధిత వ్యాదితో బాధపడుతున్నాడు. కోట్లలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ వ్యాధి శరీరంలోని ఎముక మధ్య ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా రక్తహీనత తీవ్రమై, శ్వాస ఆడక ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకు ప్రతివారం రక్త పరీక్షలు, నెలకు ఒకటి రెండు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తుంది. ఈ చికిత్స కోసం తల్లిదండ్రులు ఎనిమిదేళ్లుగా తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోయారు.

కుదిరిన బోన్‌మ్యారో..

మందులతో వ్యాధి అదుపులోకి రాకపోవడంతో శాశ్వత పరిష్కారంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని సీఎంసీ వైద్యులు సూచించారు. ఇందుకోసం మరో బిడ్డ ఉంటే దాతగా ఉపయోగపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆ దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. అదృష్టవశాత్తు అతని బోన్‌మ్యారో అన్నయ్యకు వంద శాతం సరిపోయింది. మార్పిడికి అవసరమైన పది కేజీల బరువు, రెండేళ్ల వయస్సు రావడంతో ఇప్పుడు వెల్లూరు సీఎంసీ ఆసుపత్రిలో కీలకమైన స్టెమ్‌సెల్స్‌ మార్పిడి ప్రక్రియ మొదలైంది.

దాతలే దిక్కు..

ప్రస్తుతం చిన్న బాబు నుంచి స్టెమ్‌సెల్స్‌ సేకరించి పెద్ద బాబు రియాన్‌ జశ్వంత్‌కు ఎక్కించే కీలక ఘట్టం జరుగుతోంది. ఈ చికిత్స విజయవంతమై బాలుడు పూర్తిగా కోలుకోవాలంటే సుమారు వంద రోజులపాటు ఆసుపత్రి పర్యవేక్షణ, ఏడాదిపాటు నిరంతర పరీక్షలు అవసరం ఉటుంది. ఇందుకోసం కనీసం రూ. 16 లక్షలు ఖర్చు అవుతుందని, ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ వంటి ఇతర సమస్యలు తలెత్తితే ఈ ఖర్చు రూ. 25 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని సీఎంసీ హెమటాలజీ విభాగాదిపతి డాక్టర్‌ కోరుల అను చెబుతున్నారు. ఇప్పటికే బంధువులు, స్నేహితులు సహాయంతో నెట్టుకొచ్చిన తండ్రి చిరంజీవి ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. మనసున్న దాతలు స్పందించి ఆర్థిక సహా యం అందిస్తే ఓ పసివాడికి పునర్జన్మ అందించేవారవుతారని ఆ కుటుంబం వేడుకుంటుంది.

సాయం చేయాలనుకుంటే..

మాస్టర్‌ రియాన్‌ జశ్వంత్‌, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ, రాణిపేట క్యాంపస్‌ వెల్లూరు, ఆసుపత్రి నెంబరు 849851పి వివరాలతో ఆసుపత్రికి నేరుగా సహాయం చేయాలనుకునే వారు ది ట్రెజరర్‌, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ డీడీ/చెక్కు లేదా వైర్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా పంపవచ్చు. తండ్రి ఫోన్‌ నంబర్‌ (గూగుల్‌పే/ ఫోన్‌పే వివరాలకు 9666360983) నంబన్‌ను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement