● వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
● ఒడిశాలో లోయలో జారిపడిన
రెంటికోట మెడికో
● మొగిలిపాడు వద్ద లారీని ఢీకొన్న మహిళ
కాశీబుగ్గ/టెక్కలి రూరల్ :
రెండు ఇళ్లల్లో తీవ్ర విషాదం అలముకుంది. ఓచోట కన్నతల్లిదండ్రులకు కడుపుతీపి దూరమవగా..మరోచోట ఆ చిన్నారికి కన్నతల్లి ప్రేమ కరువయ్యింది. వేర్వేరు ప్రాంతాల్లో గురువారం జరిగిన ఈ ఘటనలతో ఇటు పలాస మండలం రెంటికోటలో విషాదం నింపగా..అటు టెక్కలి మండలం గూడెం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తల్లిదండ్రులకు పుత్రశోకం, కన్న పేగుకు మాతృవిలాపానికి విధి గురిచేసింది.
జలపాతంలో జారిపడి..
పలాస మండలం రెంటికోటకు చెందిన సాయిశంకర్ పండా (నిఖిల్) ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురలోని ఓ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల ఒత్తిడి నుంచి సేదదీరుదామని స్నేహితులతో కలిసి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బార్కేశ్వరి ఘాట్‌లో విహారానికి వెళ్లాడు. సమీపంలోని పర్యాటక ప్రాంతమైన ముగురా జలపాతం అందాలను మిత్రులతో కలిసి ఆస్వాదించాడు. అందరితో కలిసి జలపాతం అంచుల్లో నిలబడి రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరి గాలించారు. కొంత సమయం తర్వాత విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు సిప్రా పండా, సునీల్ పండా హతాశులయ్యారు. ఒక్కగానొక్క కొడుకు ఇకలేడని తెలిసి తల్లడిల్లిపోయారు. తండ్రి సునీల్ రెంటికోటలో మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. తల్లి గృహిణి. కొడుకు కోసం తల్లిదండ్రులు బ్రహ్మపురలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. విధి విహారయాత్ర రూపంలో కన్నపేగును దూరం చేసింది.
కబళించిన మృత్యువు..
పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదం ఓ బిడ్డకు తల్లిని దూరం చేసింది. రహదారి చెంత ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో మహిళ దుర్మరణం చెందింది. టెక్కలి మండలం గూడెం గ్రామానికి చెందిన పోకల సుజాత మందస మండలం టి.గంగువాడలో జరిగే వివాహ వేడుకకు హాజరైంది. అక్కడ విందు అనంతరం తిరిగి టెక్కలి తన స్కూటీపై బయలుదేరింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ డ్రైవర్ విశ్రాంతి నిమిత్తం లారీని రహదారి పక్క ఆపి నిద్రకు ఉపక్రమించాడు. ఆ లారీని సుజాత ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈమె భర్త శ్రీధర్ వలస కూలీ. కుమార్తె శిరీష తొమ్మిదో తరగతి చదువుతోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


