● పూజారిబంబు గ్రామానికి రహదారి పనులు ప్రారంభం ● గ్రామస్తుల ఆందోళనతో దిగివచ్చిన జిల్లా యంత్రాంగం
రాయగడ : మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న నిర్లక్ష్యానికి పూజారిబంబు గ్రామ సమస్య నిదర్శనంగా నిలిచింది. జిల్లా కేంద్రానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ సదరు సమితి పరిధిలోని బైసింగ్ పంచాయతీ పూజారిబంబు గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఇటీవల గ్రామస్తులు ఉద్యమబాట పట్టారు. రెండు రోజుల పాటు సామూహిక సత్యాగ్రహం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చివరకు గ్రామస్తుల ఐక్యపోరాటానికి దిగివచ్చిన జిల్లా యంత్రాంగం రహదారి నిర్మాణానికి లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళనకు తెరపడింది. తాజాగా నిర్మాణ పనులు సైతం ప్రారంభించారు.
ఏం జరిగిందంటే..
గ్రామస్తుల ప్రధాన డిమాండ్ పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు అధికారులు సమస్య పరిష్కష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొలనార గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో చర్చలు జరిపారు. జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్రనాద్ కమార్, బీడీఓ సుజిత్ కుమార్ మిశ్రా, పోలీసు అధికారులు, సర్పంచ్, గ్రామస్తులు హాజరయ్యారు. గతంలోనూ పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ స్పష్టమైన హామీ లభించకపోవడంతొ గ్రామస్తులు తమ ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో అధికారులు గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకుని వారి సందేహాలు, అభ్యంతరాలను నివృత్తి చేశారు. రహదారి నిర్మాణానికి తీసుకున్న చర్యలు, పనుల ప్రారంభం, పూర్తి చేసే గడువు తదితర అంశాలను వివరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కహార్ రహదారి నిర్మాణానికి సంబంధించిన లిఖితపూర్వక హామీ పత్రాన్ని సర్పంచ్, గ్రామస్తులకు అందజేశారు. దీనిలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏడు రోజుల్లో రహదారి పనులు ప్రారంభించనున్నట్లు హామీ పత్రంలొ పేర్కొన్నారు. గ్రామానికి పూర్తి స్థాయి బీటీరొడ్డు సౌకర్యం కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదనను అమలు చేసి ఆరు నెలల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. కేవలం మౌఖిక హామీలకే పరిమితం కాకుండా లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
మూడు మార్గాల పరిశీలన
గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఫలితంగా కదలివచ్చిన జిల్లా యంత్రాంగం రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించింది. ఈ క్రమంలో పూజారిబంబు గ్రామానికి రహదారి అనుసంధానం కల్పించే విషయంలో జిల్లా యంత్రాంగం గతంలోనే కసరత్తు ప్రారంభించింది. కలక్టర్ అశుతొష్ కులకర్ణి ఆదేశాల మేరకు సమితి అధికారులు గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టేందుకు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించారు. ఆయా మార్గాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమగ్ర నివేదికను జిల్లా యంత్రాగంకు సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనుల ప్రారంభానికి మార్గం సుగమం కావడంతో గ్రామస్తుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు త్వరలోనే తెరపడే పరిస్థితి ఏర్పడింది.
దత్తత గ్రామంగా..
రహదారి నిర్మాణంతొ పాటు పూజారిబంబు గ్రామంలోని ఇతర సమస్యల పరిష్కారంపైనా అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారి గ్రామాన్ని దత్తత గ్రామంగా స్వీకరించి, గ్రామంలో చేపట్టే అభివృధ్ది కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తామని హామీఇచ్చారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. మొత్తానికి రెండు రోజుల పాటు గ్రామస్తులు నిర్వహించిన సామూహిక సత్యాగ్రహం అధికార యంత్రాంగాన్ని స్పందించేలా చేసింది. ఇచ్చిన హామీ ప్రకారం బుధవారం నుంచి రహదారి నిర్మాణానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.


