సహకార బ్యాంక్ అధ్యక్షులు ఈశ్వర
చంద్రపాణిగ్రహి
జయపురం: సహకార బ్యాంక్ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు, ఆర్ధిక క్రమశిక్షణ కొనసాగించటం, రుణాలు వసూళ్లలో బాధ్యతాయుతంగా వ్యవహరించటంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనంపై సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని అధ్యక్షులు ఈశ్వర చంద్రపాణిగ్రహి అన్నారు.
సహకార బ్యాంకుల ఆర్థికలావాదేవీల నిర్వహణ, బ్యాంక్ కార్యకలాపాల పనితీరులపై స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీబీ) ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్ బోర్డు, సిబ్బంది విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. ఉత్కళ జననీ గీతాలాపనతో ప్రారంభమైన కార్యక్రమంలో రుణ పథకాలు, బ్యాంక్ ఆదాయ వ్యయాలు, బ్యాంక్ ఆసుల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. బ్యాంక్ అధ్యక్షులు, ఇంజినీర్ ఈశ్వర చంద్ర పాణిగ్రహి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ రిజిస్టార్ మోనిక రాయ్, సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, ఉపాధ్యక్షురాలు దురుపత భొత్ర, డైరెక్టర్లు ఉదయనాఽథ్ మాద్రి, ప్రభా జాని, భీమ హరిజన్, సహకార సంస్థల సహాయక పరిశీలకులు బొనాచారి, బ్యాంక్ కార్యదర్శి ఐశ్వర్య రత్న మహంతి, ఉపాధ్యక్షురాలు భుర్శితా భొత్ర, సహాయ డైరెక్టర్లు గోపీ పంగి బ్యాంకు పనితీరు, సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంక్ కమిటీ అధ్యక్షులు ఈశ్వర చంధ్ర పాణిగ్రహి మాట్లాడుతూ.. సహకార బ్యాంక్ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు, ఆర్ధిక క్రమశిక్షణ కొనసాగించటం, రుణాలు వసూళ్లలో బాధ్యతాయుతంగా వ్యవహరించటంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనంపై అధికారులు డైరెక్టర్లు, ఉద్యోగులు పని చేయాలని పిలుపు నిచ్చారు. సహకార సంస్థ సమగ్రాభివృద్ధి, సభ్యుల ఆర్థిక అభ్యున్నతికి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.


