పెరుగుతున్న చలిగాలులు! | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న చలిగాలులు!

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

మూడు రోజుల్లో 3 నుంచి 5 డిగ్రీలు

తగ్గనున్న రాత్రి ఉష్ణోగ్రతలు

భువనేశ్వర్‌: ఒడిశాలో చలి క్రమంగా పుంజుకుంటోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ.. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు దిగజారుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.

ఝార్సుగుడ, దేవ్‌గఢ్‌లో 15.6 డిగ్రీలు

బుధవారం ఉదయం 8.30 గంటల వరకు గడచిన 24 గంటల్లో ఝార్సుగుడ, దేవ్‌గఢ్‌లో 15.6 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవే రాష్ట్రంలో అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రతలు. కొరాపుట్‌లో 16.4, బౌధ్‌లో 16.9, బర్‌గడ్‌, సంబల్‌పూర్‌లో 18.6, బొలంగీర్‌లో 17.7, రాయగడలో 17.2, నువాపడాలో 17.0, ఫుల్బణిలో 17.0 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి.

రాజధానిలో 21.3 డిగ్రీలు

రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21.3 డిగ్రీలు, కటక్‌లో 18.6 డిగ్రీలు నమోదయ్యాయి. పూరీలో 23.6, గోపాల్‌పూర్‌లో 22.4, చాంద్‌బాలిలో 21.7 డిగ్రీలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలతో పోలిస్తే అంతర్గత జిల్లాల్లో రాత్రి చలి ఎక్కువగా కనిపిస్తోంది.

పొగమంచు కూడా..

చలి పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో ఉదయం పొగమంచు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రూర్కెలా, అంగుల్‌, బొలంగీర్‌ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు నమోదై దృశ్యమానత 30 నుంచి 200 మీటర్లకు తగ్గింది. భవానీపట్నలో మోస్తరు పొగమంచు, కెందుఝొర్‌లో పలుచటి పొగమంచు నమోదైంది. కటక్‌, కేంద్రాపడా, జగత్సింగ్‌పూర్‌, సుందర్‌గఢ్‌, ఝార్సుగుడ, సంబల్‌పూర్‌, కెందుఝొర్‌, కొరాపుట్‌, ఖుర్దా జిల్లాల్లోనూ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

వర్షాలకు విరామం

రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం పొడిగానే కొనసాగుతోంది. డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు గణనీయమైన వర్షాలకు అవకాశం లేదని ఐఎండీ అంచనా వేసింది. పొడి వాతావరణం, నిర్మలమైన ఆకాశం కారణంగా రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement