రాయగడ : విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నాణ్యమైన విద్యాభివృద్ధి లక్ష్యంగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నీలాచల్ రంగ్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఒడియా భాష, సాహిత్యం, సంసృతి శాఖ సహకారంతో శాసీ్త్రయ నృత్యాలు, సంగీతం, కళలు, జానపద నృత్యాల ప్రాచుర్యం, ప్రచారం లక్ష్యంగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఐదో ఏడాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం భువనేశ్వర్‌లోని జయదేవ్ భవన్‌లో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద్ గొండొ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. గౌరవ అతిథులుగా ప్రతీకార్ పత్రిక సంపాదకులు శుభాశీష్ మిశ్రా, జయ సేవా పౌండేషన్ వ్యవస్థాపకులు సోమనాథ్ రద్, విద్యావేత్త మనోజ్‌కుమార్ పరిడా తదితరులు పాల్గొన్నారు. అసోం రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఒడిస్సీ నృత్య గురువు దేవబ్రత బారువా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒడిస్సీ నృత్య గురువు కుశాల్ భట్టాచార్య, మధ్యప్రదేశ్‌కు చెందిన కథక్ నృత్య గురువు జస్వంత్ కబీర్ పాల్గొన్నారు. ఒడిశాకు చెందిన అంబిషన్ నృత్య సంస్థ అధినేత చైతన్య నాయక్ పర్యవేక్షణలో 20 మందికి పైగా కళాకారులు సంబల్‌పురీ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కోల్‌కతాకు చెందిన గురువ స్వప్నా నంది మార్గదర్శకత్వంలో 13 మంది కళాకారులు క్షత్రియ నృత్యాలను ప్రదర్శించారు. విద్య, సంస్కృతి సేవా కార్యక్రమాలు, విజ్ఞానం, కళలు, సాహిత్యం తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన కవి, నవలా రచయిత అజయ్‌కుమార్ మహాలా, కొరాపుట్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త శంభుసింగ్, కంధమాల్‌కు చెందిన నిమేష్ దాగాల్, గంజాం జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్ డౌడొ, అశోక్‌కుమార్ గౌడొ, ఖుర్దాకు చెందిన అభిమన్యు బారిక్, గజపతి జిల్లా కుచెందిన సంతోష్ కుమార్ మహారాణ, నయాగడ్ జిల్లాకు చెందిన తారాప్రసాద్ హత్, ఝార్సుగుడకు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త అజయ్ పటేల్, ఖుర్దాకు చెందిన మంజుశ్రీ రాయ్, రాయగడ జిల్లా మునిగుడ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త శ్రీను భిబార్, కాసీపూర్ ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్ నాయక్‌లను కూడా ఘనంగా సత్కరించారు. అనంతరం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. నూతన సభ్యులుగా రాయగడకు చెందిన అమరేంద్రనాథ్, శిశిర్ రౌలొ, జయలక్ష్మీ మల్లిక్, అభిరాం నంద, సంగ్రామ్ కేసరి నాయక్‌లు సంస్థల్లో సభ్యత్వం స్వీకరించారు.


