భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ఎన్నికలు గురువారం జరుగుతాయి. ఈ ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరిగేలా చూసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, తాజా పరిస్థితులను సమీక్షిస్తోందని విభాగం మంత్రి సూర్యబన్షి సూరజ్ తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోలింగ్ ఆద్యంతం శాంతిభద్రతలను కాపాడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు శాంతియుతంగా, జరిగేలా చూడాలని విద్యాసంస్థలకు, విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు. పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. కొత్తగా ఎన్నికై న విద్యార్థి ప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగనుంది.
కొనసాగుతున్న రిమాండ్
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి దేవితి గ్రామంలో కల్యాణ మండపంలో ఇటీవల క్యాసినో ఆటలో పట్టుబడిన 71 మంది నిందితులకు ఇంకా స్టేషన్ బెయిల్ మంజూరుకాలేదని మోడల్ పోలీసు స్టేషన్ అధికారి (ఐఐసీ) ప్రశాంత భూపతి బుధవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ కల్యాణ మండపాన్ని పర్లాకిమిడికి చెందిన విలేకరి రష్మిరంజన్ మిశ్రా మరొకరికి లీజుకు ఇచ్చారు. దసరా పండగ నేపథ్యంలో ప్రభుత్వ లైసెన్సు లేకుండా జూద శిబిరం నిర్వహించడంతో పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
శ్రీకాకుళం వన్‌టౌన్ సీఐగా రామకృష్ణ
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం ఒకటో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా యెన్ని రామకృష్ణను నియమిస్తూ విశాఖ రేంజి ఐజీ గోపినాథ్ జెట్టి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఐ కె.పైడపునాయుడును అనకాపల్లి రూరల్ సీఐగా బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: ఆమదాలవలసకు చెందిన నారా ఇందులక్ష్మి (62) మృతి చెందడంతో ఆమె నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. జిల్లా రెడ్‌క్రాస్ సమన్వయంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, బి.మనుకుమార్లు కార్నియాలను సేకరించి ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యులకు జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు.
నేడు నిద్దాంలో ఉచిత గుండె పరీక్షల శిబిరం
జి.సిగడాం: నిద్దాం గ్రామంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పేదల కోసం ఉచిత గుండె, ఊపరితిత్తుల వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు మాజీ వైస్ ఎంపీపీ మీసాల సాద్వీమణి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


