ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో ఈ నెల 22 నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగ మహిళలకు బ్యూటీ పార్లర్ నిర్వహణలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్ రామ్‌జీ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9553418809 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
బస్‌షెల్టర్ కూల్చివేత
రణస్థలం: జీరుపాలెం కూడలిలో ప్రభుత్వ బస్ షెల్టర్‌ను ఇద్దరు వ్యక్తులు జేసీబీతో కూల్చివేశారు. పక్కన ఉన్న వాణిజ్య దుకాణాలకు అడ్డుగా ఉందన్న నెపంతో ఇలా కూల్చివేశారని జీరుపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మద్యం దొంగతనం కేసులో ముగ్గురికి జైలుశిక్ష
కొత్తూరు : నివగాం గ్రామంలోని వైన్ షాపులో మద్యం దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు రెండేళ్ల ఆరు నెలలు చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 20 వేలు జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి బుధవారం తీర్పు చెప్పినట్లు కొత్తూరు ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. 2019 ఏడాది ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి రూ.33,600 విలువైన మద్యం బాక్సులను సీతంపేట మండలం నారాయణగూడకు చెందిన సవర రామకృష్ణ, హిరమండలం మండలం గుర్రాలమెట్టకు చెందిన సవర సూర్యం, సవర రవి చోరీ చేశారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
కవిటి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సూచించారు. బుధవారం కాశీబుగ్గ డీఎస్పీ గంటా వెంకటరమణతో కలిసి కవిటిలో స్ట్రాంగ్‌రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను తనిఖీ చేశారు. ఇచ్ఛాపురం సర్కిల్ ఇనస్పెక్టర్ మీసాల చిన్నంనాయుడు, కవిటి ఎస్ఐ వి.రవివర్మలతో మాట్లాడి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఆరాతీశారు. ఎటువంటి సమస్యలు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


