కొరాపుట్: దేశ రక్షణ రంగంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్) సేవలు చిరస్మరణీయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. జిల్లాలోని సునాబెడాలో మంగళవారం ఆయన పర్యటించారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జితో కలసి కొరాపుట్ జిల్లా సునాబెడా వచ్చారు. వారికి కలెక్టర్ సత్యవాన్ మహాజన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హిందూస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్) ప్రాంగణంలో వివిధ కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. హల్‌లో జరిగిన సమావేశంలో 2000వ యుద్ధ విమాన ఇంజన్‌ని హల్ నుంచి ఎయిర్‌ఫోర్స్‌కి అప్పగించారు. అంతకుముందు రు.218 కోట్లతో ఏర్పాటు చేయనున్న శక్తి యుద్ధ విమాన ఇంజిన్ యునిట్‌కి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు హల్ ద్వారా 2000 ఏరో ఇంజిన్లు తయారి చేసి యుద్ధరంగానికి అప్పగించడం హర్షణీయమన్నారు. దీనికి కృషి చేసిన ఇంజినీర్లు, సిబ్బంది, కిందిస్థాయి వర్కర్లను అభినందించారు. కొరాపుట్‌లోని హల్, విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లు దేశ రక్షణలో వెన్నెముకగా ఉన్నాయని పేర్కొన్నారు. శక్తి యుద్ధ హెలికాప్టర్ ఇంజిన్ తయారీ యునిట్ ద్వారా 9 వేల ఇంజిన్లు తయారు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో మరింత ఆధునిక ఏరో ఇంజినీరింగ్ విధానాలు అనుసరిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో తదితరులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా 30 ప్లాటున్ల పోలీసులను మెహరించారు. అదనంగా అందుబాటులో ఉన్న సైనిక దళాలను వినియెగించుకున్నారు. కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, జయపూర్ ఎస్డీపీవో అర్చనా మిట్టల్‌లు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
అరెస్టుల పర్వం
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొరాపుట్ జిల్లాకు రాకముందే అరెస్టుల పర్వం కొనసాగింది. మంగళవారం ఉదయం కొరాపుట్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుపక్ తురుక్ నివాసాన్ని పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అనంతరం అతడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంట్లో ఉన్న తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని రూపక్ ప్రశ్నించగా పోలీసులు బదులివ్వలేదు. మరోవైపు సునాబెడా, సిమిలిగుడ పట్టణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క మండిపడ్డారు. చేతకాని ప్రభుత్వం అరెస్టులతో భయపెట్టాలని చూస్తోందని సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడం మీడియాతో మాట్లాడారు. 10 రోజుల క్రితం కొరాపుట్ జిల్లాలోని వరద ప్రాంతాల్లో సీఎం మెహన్‌చరణ్ మజ్జి పర్యటించిన విషయం గుర్తు చేశారు. అయితే నేటికీ అక్కడి బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపించారు. అలాంటప్పుడు మరలా ఎలా కొరాపుట్ జిల్లాకి వచ్చారని ఎద్దేవా చేశారు. సునాబెడాలో హల్ డివిజన్‌లో స్థానికులకు కూడా కొన్ని ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా నేల, నీరు వినియోగించుకొని కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం లేదన్నారు. ఈసారైనా శక్తి యునిట్‌లో స్థానిక యువతకి కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.


