● రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషనర్ సమావేశం
భువనేశ్వర్: రాష్ట్రంలో 2027లో జరగనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మధుసూదన్ పాఽఢి అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు పారదర్శకంగా, దోష రహితంగా ఓటర్ల జాబితా సిద్ధం చేయడంపై సమావేశంలో చర్చించారు. అక్టోబర్ 26 నుంచి ఇంటింటా ఓటర్ల సర్వే ప్రారంభమవుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు వివరించారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, అనర్హులు, బదిలీ అయినవారు, మరణించిన వారి వివరాలను ధ్రువీకరించడం, అవసరమైన సవరణలు చేపట్టడం ఈ సర్వే ఉద్దేశమని తెలిపారు. సర్వే ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ స్థాయి ఏజెంట్లను (బీఎల్‌ఏ) నియమించి, వారి వివరాలను అక్టోబర్ 15లోగా సంబంధిత అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌ఓ)కు సమర్పించాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో బీడీవోలకు, పట్టణ ప్రాంతాల్లో నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, మున్సిపాలిటీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు, మెట్రోపాలిటన్ మున్సిపాలిటీల్లో డిప్యూటీ కమిషనర్/అసిస్టెంట్ కమిషనర్‌లకు ఈ వివరాలు అందించాలని తెలిపింది.
ఖచ్చితమైన ఓటర్ల జాబితాతో
నిష్పక్షపాత ఎన్నికలు
ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిష్పక్షపాత ఎన్నికలకు పునాది అని మధుసూదన్ పాఢి అన్నారు. ఓటర్ల జాబితా తయారీలో ప్రతీ దశలో పారదర్శకత, నిష్పాక్షికత, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాజకీయ పార్టీల సహకారంతో జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించవచ్చని పేర్కొన్నారు.
ఇంటింటి సర్వే సందర్భంగా ఓటర్ల నుంచి స మాచార సేకరణ, పేర్ల చేర్పు, తొలగింపు, వివరా ల సవరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు చేరకుండా రాజకీయ పార్టీలు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కమిషన్ సూచించింది. సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు చేయడంతోపాటు, ఇంటింటా సర్వేకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కమిషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ దాస్, డిప్యూటీ సెక్రటరీ దుర్గా చరణ్ ముర్ము, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


