● ఆందోళన చెందుతున్న పున్నాం గ్రామస్తులు
జి.సిగడాం: తమ అనుమతి లేకుండా తమ భూముల్లో మాంగనీస్ ఖనిజానికి పరీక్షలు కోసం వేదాంత మైనింగ్ కంపెనీ సిబ్బంది ప్రత్యేక సర్వేలు చేస్తోందని పున్నాం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆ భూమి లేకపోతే తమ జీవనం కష్టమవుతుందని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. పున్నాం గ్రామ సమీపంలో సుమారుగా 152 ఎకరాల భూమిలో మైనింగ్ ఉందని, రైతుల అనుమతి లేకుండా నేరుగా వేదాంత కంపెనీ సిబ్బంది ప్రత్యేక సర్వే చేస్తున్నారని, వాటిని తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ పున్నాం, బూటుపేట గ్రామస్తులంతా సోమవారం తహసీల్దార్ కార్యలయం వద్ద నిరసన తెలిపారు. తమ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా సర్వే చేయడం ఎంత వరకు న్యాయమన్నారు. ఇలా చేస్తే పోరాటాలు చేస్తామన్నారు. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుషితమైపోయాయని, మైనింగ్ కంపెనీ పెడితే తమ జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నాయుడుగారు నిర్మలకు వినతి పత్రం అందించారు. అలాగే సోమవారం పీజీఆర్‌ఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు.


